ముంబయి : పేపర్ లీక్ కారణంగా మహారాష్ట్రలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల నియామకం నిలిచిపోయింది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలోని గ్రూప్ బి, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీ ప్రక్రియను మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంపిఎస్‌సి) బుధవారం రద్దు చేసింది. మార్చి 22న నిర్వహించిన స్ర్కీనింగ్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైనట్లు ముంబయి పోలీసుల విచారణలో నిర్థారణ కావడంతో ఎంపిఎస్‌సి ఈ నిర్ణయం తీసుకుంది. పరీక్షకు ముందే తాము ప్రశ్నాపత్రాన్ని పొందినట్లు జులై 22-26మధ్య కొందరు ఎంపిఎస్‌సి అభ్యర్థులు పేర్కొన్నారు. మరికొందరు సోషల్ మీడియాలో పూర్తి ప్రశ్నాపత్రం లభించిందని వెల్లడించారు. దీంతో ఎంపిఎస్‌సి జులై 27న ముంబయి పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. ఒక అభ్యర్థికి ప్రశ్నపత్రం లభించిందని, దీంతో ఆ అభ్యర్థి లబ్ధి పొందారని ప్రాథమికంగా తేలినట్లు ముంబయి పోలీసు క్రైమ్ బ్రాంచ్ సమర్పించిన నివేదిక తెలిపింది. అయితే ఈ ప్రశ్నాపత్రంతో ఒకరు లేదా అంతకంటే ఎక్కువమంది లబ్ధి పొందారా లేదా అనేది స్పష్టంగా తెలియాల్సి వుందని స్పష్టం చేసింది.
మరోసారి పరీక్షను నిర్వహించనున్నట్లు ఎంపిఎస్‌సి తెలిపింది. గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయనవసరం లేదని, ఎలాంటి పరీక్ష రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించింది. పునఃపరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడిగా ప్రచురించనున్నట్లు పేర్కొంది.
ఎంపిఎస్‌సి ఈ పోస్టుకు సంబంధించి గతేడాది జులై 29న తొలి నోటిఫికేషన్ జారీ చేయగా, రాష్ట్రంలోని ఆరు డివిజనల్ ప్రధాన కార్యాలయాల్లోని కేంద్రాల్లో మార్చి 22న ఆఫ్‌లైన్‌లో పరీక్ష నిర్వహించారు. ఫలితాలను జూన్ 12న ప్రకటించారు. 506 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు అర్హులుగా తేల్చారు. వారిలో 488 మంది జులై 1 నుండి జులై 22 మధ్య జరిగిన రౌండ్‌లో ఉత్తీర్ణులయ్యారు. 488 మంది అభ్యర్థులతో కూడిన తాత్కాలిక సాధారణ మెరిట్ జాబితాను విడుదల చేయగా, అందులో 485 మంది అభ్యర్థులు అర్హులుగా పరిగణించబడ్డారు.







కామెంట్‌లు (0)