ప్రజాశక్తి - చల్లపల్లి: తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ జాతిపిత మహాత్మాగాంధీజికి స్వర్ణగ్రామ సచివాలయ ఉద్యోగులు మొరపెట్టుకున్నారు. ఉద్యోగంలో చేరి ఏడేళ్ళు పూర్తయినా... ఏదారీ లేకుండా ఆనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ జయంతి అవనిగడ్డ నియోజకవర్గంలోని పలు సచివాలయాలకు చెందిన ఉద్యోగులు శుక్రవారం చల్లపల్లిలోని మహాత్ముని విగ్రహం వద్దకు చేరుకుని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. సచివాలయ వ్యవస్థ ఏర్పడి నేటికి ఏడేళ్ళు పూర్తయినా ఇప్పటి వరకూ ఎటువంటి ఎదుగూబొదుగూ లేకుండా ఎక్కడి గొంగలి ఆక్కడే ఆన్నట్లుగా కొట్టుమిట్టాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ సెప్టెంబర్ 27వ తేదీన ‘చలో విజయవాడ’ చేపట్టిన 46 మందిపై పెట్టిన ఆక్రమ కేసులు ఎత్తివేయాలని, సస్పెండ్ చేసిన సచివాలయ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. తమకు న్యాయంగా రావాల్సిన రెండు నోషనల్ ఇంక్రిమెంట్లను మంజూరు చేయాలని, కనీసం మూలవేతనం రూ.30,000లకు తగ్గకుండా స్పష్టమైన ప్రమోషన్ చానల్ కల్పించాలని కోరారు. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఇవ్వాల్సిన అన్ని ప్రయోజనాలను మూడు నెలల్లోపు ఇవ్వాలని,అర్హత మేరకు కారుణ్య నియామక ప్రక్రియను కూడా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. స్వర్ణగ్రామ ఉద్యోగులపై ఆదనపు పని భారం పెంచుతున్న డిప్యుటేషన్లను వెంటనే రద్దు చేయాలని కోరారు. ప్రొబేషన్ ఆలస్యమైన తొమ్మిది నెలల కాలానికి బకాయిలు మంజూరు చేయాలని, జి.ఎం.ఎస్ నెం.11ను వెంటనే రద్దు చేయాలని, సర్వీసు, ఉద్యోగ ఆర్థిక సంబంధిత సమస్యలపై ప్రభుత్వం వెంటనే చర్చలు నిర్వహించి పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని మహాత్మునికి సమర్పించారు.
మహాత్మునికి వినతి పత్రం సమర్పించిన సచివాలయ ఉద్యోగులు
02 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 02, 2026, 05:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)