2019 నుంచి 2026 వరకు 35 మందికి పైగా మృతి
(ప్రజాశక్తి - విశాఖపట్నం) : అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు కార్మికులు సజీవదహనమవడం పారిశ్రామిక భద్రతపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. ఫార్మాసిటీలోని దక్షిణ ఎన్‌వైడ్ కెమికల్ కంపెనీలో సంభవించిన ఈ ఘటనతో పరవాడ–అచ్యుతాపురం పారిశ్రామిక ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. గ్యాస్ లీకులు, రియాక్టర్ పేలుళ్లు, అగ్నిప్రమాదాలతో గత ఏడు సంవత్సరాల్లో 35 మందికి పైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయినా భద్రతా వ్యవస్థల్లో ఆశించిన మార్పులు కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
పరవాడ ఫార్మాసిటీ, అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ) ప్రాంతాలు ఈ మధ్యకాలంలో తరచూ ప్రమాదాలతో వార్తల్లో నిలుస్తున్నాయి. గ్యాస్ లీకులు, రియాక్టర్ పేలుళ్లు, అగ్నిప్రమాదాలు కార్మికుల ప్రాణాలను బలిగొంటున్నాయి. ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతున్నా తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వరుసగా ప్రమాదాలు ...
2019 డిసెంబర్ 3న పరవాడ ఫార్మాసిటీలోని స్మైలాక్స్ లాబొరేటరీస్‌లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మరణించారు. ఆ ఘటనను ఒక హెచ్చరికగా తీసుకుని భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ, తరువాతి కాలంలో వరుస ప్రమాదాలు ఆ హెచ్చరికలను ఎవరూ పట్టించుకోలేదని సూచించాయి. 2020 జూన్ 30న సైనర్ లైఫ్ సైన్సెస్‌లో హైడ్రోజన్ సల్ఫైడ్ (H₂S) గ్యాస్ లీకై ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. రెండు వారాలు గడవకముందే జూలై 13న ఆక్టస్ జెనెరిక్స్‌లో రియాక్టర్ పేలుడు సంభవించి ఒక కార్మికుడు మరణించాడు. అదే ఏడాది ఆగస్టు 18న ఆల్కలి ఫార్మాలో జరిగిన అగ్నిప్రమాదంలో మరో కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు.
2020 సంవత్సరంలోనే ఫార్మాసిటీ పరిధిలో ఐదుకు పైగా ప్రమాదాలు చోటుచేసుకున్నాయని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. కేవలం కొన్ని నెలల వ్యవధిలో ఏడుగురు కార్మికులు మరణించడం ఫార్మాసిటీలోని భద్రతా వ్యవస్థల బలహీనతను బహిర్గతం చేసింది. ఇదే సమయంలో విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో 2020 మే 7న జరిగిన స్టైరిన్ గ్యాస్ లీక్‌లో 13 మంది మరణించడం పారిశ్రామిక భద్రతపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
2023 జూన్ 27న అచ్యుతాపురంలోని సహితా ఫార్మాలో రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు మరణించారు. 2024 ఆగస్టు 21న అచ్యుతాపురం SEZలోని ఎస్సెన్షియా అడ్వాన్స్‌డ్ సైన్సెస్‌లో జరిగిన భారీ పేలుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో 17 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, 30 మందికిపైగా గాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్నేళ్లలో జరిగిన అత్యంత ఘోర పారిశ్రామిక ప్రమాదాల్లో ఇది ఒకటిగా నమోదైంది.
కూలిపోతున్న కుటుంబాలు ....
2025 జూన్‌లో సాయి శ్రేయస్ ఫార్మాస్యూటికల్స్‌లో హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ లీక్ కారణంగా ఇద్దరు కార్మికులు మరణించారు. సెప్టెంబర్‌లో డెక్కన్ రెమెడీస్‌లో మెథనాల్ గ్యాస్ లీక్ మరో ప్రాణాన్ని బలిగొంది. 2026 జనవరిలో అచ్యుతాపురంలోని ఎస్‌వీఎస్ కెమికల్స్‌లో అగ్నిప్రమాదం జరిగినప్పటికీ అదృష్టవశాత్తూ ప్రాణనష్టం తప్పింది. తాజాగా పరవాడ ఫార్మాసిటీలోని దక్షిణ ఎన్‌వైడ్ కెమికల్ కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు కార్మికులు సజీవదహనమవడం మరోసారి పారిశ్రామిక భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది.
ఈ ప్రమాదాలన్నింటినీ కలిపి చూస్తే 2019 నుంచి 2026 వరకు పరవాడ–అచ్యుతాపురం ఫార్మా పరిశ్రమల్లో జరిగిన ప్రధాన ప్రమాదాల్లో 35 మందికి పైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి, తరువాత ప్రాణాలు కోల్పోయిన వారూ ఉన్నారు. తీవ్రమైన అంగవైకల్యానికి గురైనవారూ ఉన్నారు.
ఈ పరిశ్రమల్లో పనిచేస్తున్న వారిలో అధిక శాతం మంది కాంట్రాక్ట్ కార్మికులే కావడం పరిస్థితిని మరింత విషాదకరంగా మారుస్తోంది. ఉపాధి కోసం గ్రామాల నుంచి వచ్చిన యువకులు, మధ్యతరగతి కుటుంబాలకు ఆధారంగా నిలిచిన కార్మికులే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ప్రకటించే పరిహారాలు కుటుంబాలకు కొంత ఆర్థిక ఊరటనివ్వొచ్చు గానీ, కోల్పోయిన జీవితాలను తిరిగి తీసుకురాలేవు. ప్రమాదంలో మరణించిన వ్యక్తితో పాటు ఆ కుటుంబ భవిష్యత్తులోని అనేక ఆశలు కూడా సమాధి అవుతున్నాయి.
భద్రతా ప్రమాణాలకు తిలోదకాలు
ప్రమాదాల కారణాలపై జరిగిన విచారణల్లో దాదాపు ఒకే తరహా అంశాలు వెలుగుచూస్తున్నాయి. భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యం, పాత యంత్రాల వినియోగం, నిర్వహణలో లోపాలు, రసాయనాల నిల్వ మరియు వినియోగంలో జాగ్రత్తల కొరత, కార్మికులకు తగిన శిక్షణ లేకపోవడం, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే వ్యవస్థల బలహీనత వంటి అంశాలు పదేపదే ప్రస్తావనకు వస్తున్నాయి. ఎస్సెన్షియా ప్రమాదం తర్వాత జరిగిన ప్రాథమిక విచారణల్లో కూడా రియాక్టర్ నిర్వహణ, భద్రతా పర్యవేక్షణ, అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థల వైఫల్యాలు వెలుగుచూశాయి.
పరవాడ–అచ్యుతాపురం పారిశ్రామిక బెల్ట్‌లో 2019 నుంచి ఇప్పటి వరకు 35 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన తర్వాత కూడా భద్రతా వ్యవస్థల్లో ఆశించిన మార్పులు కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పరిశ్రమల సంఖ్య పెరుగుతోంది. పెట్టుబడులు పెరుగుతున్నాయి. కానీ కార్మికుల భద్రత కూడా అదే స్థాయిలో పెరుగుతోందా? ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం వచ్చే వరకు ప్రతి కొత్త ప్రమాదం ఒక కొత్త విచారణకే కాక, ఒక కొత్త విషాదానికీ నాంది పలికే ప్రమాదం ఉంది. కార్మికుల, ఉద్యోగుల భద్రతను కేంద్రబిందువుగా చేసుకున్నప్పుడే ఈ ప్రాంతం నిజమైన పారిశ్రామిక పురోగతికి నమూనాగా నిలుస్తుంది.









కామెంట్‌లు (0)