రూ18.70 లక్షల విలువైన 170 గ్రాముల బంగారు ఆభరణాల స్వాధీనం
ప్రజాశక్తి - రైల్వేకోడూరు : రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన రెండు దొంగతనం కేసులను పోలీసులు విజయవంతంగా చేధించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి,నిందితుల నుండి సుమారు రూ.18.70 లక్షల విలువైన 170 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు రేణిగుంట డిఎస్పి వై శ్రీనివాసరావు తెలిపారు. వివరాల ప్రకారం.. ఓబులవారి పల్లి మండలం వై.కోట పంచాయతీ పరిధిలోని యద్దలవారిపల్లి గ్రామానికి చెందిన యన్నారు అనంతమ్మ , ఆమె అన్న యద్దల ఈశ్వరయ్య నివాసంలోని బీరువాలో భద్రపరిచిన సుమారు 10 తులాల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.అలాగే అదే గ్రామానికి చెందిన యద్దల మౌనిక తన నివాసంలోని కబోర్డులో భద్రపరిచిన సుమారు 9 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు ఫిర్యాదు చేశారు.ఈ రెండు ఘటనల్లో కలిపి సుమారు 19 తులాల బంగారు ఆభరణాలు,దాదాపు రూ.20.90 లక్షల విలువైన బంగారు నగలు దొంగిలించబడినట్లు గుర్తించి పోలీసులు కేసులు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు చేసామని,దర్యాప్తులో భాగంగా సేకరించిన సాంకేతిక ఆధారాలు,స్థానిక సమాచారంతో గురువారం వై.కోట,ఎద్దులవారిపల్లి మార్గంలోని మూడు రోడ్ల కూడలి వద్ద ముగ్గురు నిందితులను పోలీసు సిబ్బంది అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. పుల్లంపేట మండలం ఎగువరెడ్డి పల్లె గ్రామానికి చెందిన కొండేటి జ్యోతి ప్రకాష్ అలియాస్ పవన్, వై కోట ఎద్దులవారి పల్లె గ్రామానికి చెందిన ఉమ్మక శివ మనోజ్ అలియాస్ మనోజ్, రైల్వేకోడూరు మండలం రాఘవరాజుపురం గ్రామానికి చెందిన నందలూరు కౌశిక్ కుమార్ రెడ్డి అలియాస్ కౌశిక్ అనే నిందితులను విచారించగా దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారు. వారి నుండి సుమారు 170 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారని, ఇందులో యన్నారు అనంతమ్మకు చెందిన 10 తులాల బంగారు ఆభరణాలు, యద్దల మౌనికకు చెందిన 7 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయని అన్నారు. మరో నిందితుడు ఎద్దుల అఖిల్ వర్ధన్ అలియాస్ అఖిల్ పరారీలో ఉండగా, అతని అరెస్టు కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. రైల్వే కోడూరు రూరల్ సీఐ డి. శ్రీనివాసులు,ఓబులవారిపల్లి ఎస్‌ఐ కె. సుజన్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ జి. వెంకటేశ్వర్లు, పోలీసు సిబ్బంది వి. బ్రహ్మానంద రెడ్డి,బి. కార్తీక్ కుమార్,వి. వెంకటయ్యలు ఈ కేసును చేధించారు. ఈ కేసును త్వరితంగా చేధించి, బంగారాన్ని స్వాధీనం చేసుకున్న రైల్వే కోడూరు రూరల్ సీఐ డి. శ్రీనివాసులు, ప్రత్యేక పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారని డీఎస్పీ తెలిపారు.








కామెంట్‌లు (0)