ప్రభుత్వానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సూచన
విద్యుత్‌పై వాస్తవాలు వెల్లడించాలి
కౌలు రైతులకు యూరియా, ఎరువులు అందించాలి
ప్రజావ్యతిరేక మున్సిపల్ సంస్కరణలను ఉపసంహరించాలి
ప్రజా ఉద్యమాలకు సిపియం మద్దతు
సాయికృష్ణ కేసులో న్యాయవిచారణతోనే వాస్తవాలు వెలుగులోకి
ప్రజాశక్తి-విజయవాడ : రాష్ట్రంలో రైతులు, కార్మికులు, ఉద్యోగులు తీవ్ర సమస్యలు, భారాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటి పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. గురువారం నాడు విజయవాడ బాలోత్సవ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ప్రజా సమస్యలు గాలికొదిలేసి ప్రతి రోజూ భూ పందేరాలు, కార్పొరేట్లకు వరాలు కురిపించడంపైనే సిఎం సమీక్షలు చేస్తున్నారని, ఇంతకంటే అన్యాయం మరొకటి లేదని అన్నారు. అలాగే రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ట్రూడౌన్ కంటేముందే వేలకోట్ల భారాలు మోపారని అన్నారు. అదానీతో సెకీ ద్వారా చేసుకున్న ఒప్పందం ప్రకారం రాజస్థాన్ నుండి ఇక్కడకు విద్యుత్ తీసుకొచ్చేందుకు ఏడాదికి రూ.3850 కోట్లు ఖర్చవుతుదని ఇదే ముఖ్యమంత్రి గతంలో చెప్పారని అన్నారు. దీని ప్రకారం 25 సంవత్సరాల్లో లక్షకోట్లకుపైగా భారం పడుతుందనీ వివరించారన్నారు. బుధవారం కూటమి ప్రభుత్వం విడుదల చేసిన విద్యుత్ ప్రొగ్రెస్ రిపోర్టులో సమర్ధత మెరుగయిందని చెబుతూనే రూ.3850 కోట్ల ప్రస్తావన చేయలేదని విమర్శించారు. కనీసం ఛార్జీలు ఉన్నాయా లేవా అనే విషయం కూడా చెప్పలేకపోయారని విమర్శించారు. దీనిపై విద్యుత్‌శాఖ మంత్రికి పెద్దగా అవగాహన లేకపోయినా 25 ఏళ్ల నుండి విద్యుత్‌శాఖ చూస్తున్న విజయానంద్ కూడా తనకు తెలియదంటున్నారని, కంపెనీతో ఒప్పందం చేసుకుని భారాలు పడుతుంటే తమకు తెలియని చెప్పడం దారుణమని అన్నారు. ఇలా చెప్పడమే విద్యుత్‌శాఖ ఇనఎఫిషియన్సీ అన్నారు. ఈ శాఖను ప్రభుత్వం నడుపుతుందా, అదానీ నడుపుతున్నాడా అదన్నా ప్రజలకు చెప్పాలన్నారు.
అలాగే యూనిట్‌కు రూ.0.13 పైసలు తగ్గించామని చెబుతున్నారని, ఒకసారి రూ.7000 కోట్లు, మరోసారి రూ.8000 కోట్లు భారం వేసి రూ.1200 కోట్లు తగ్గించారని అన్నారు. సరఫరా చేయడాని కంటే ముందే అడ్వాన్సుగా రూ.0.40 పైసలు పెంచి రూ.0.13 పైసలు తగ్గించామని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెబుతున్నారని, ఇప్పుడున్న ధరలు ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు. అధికారంలోకి రాకముందు విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారని విమర్శించారు. పోలవరం సహా జల, సోలార్ ఇతర విద్యుత్ అంతా అందుబాటులోకి వస్తే యూనిట్ రూ.1కే ఇవ్వవచ్చని అన్నారు. అయినా ప్రస్తుతం యూనిట్‌కు రూ.5 నుండి రూ.7 వరకూ భారం పడుతుందని విమర్శించారు. ఈ రకమైన భారాలు వేసే పద్దతులు విరమించుకోవాలని, తప్పుడు ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని హెచ్చరించారు.
పొగాకు రైతుల్ని ఆదుకోండి
ప్రకాశం జిల్లాలో వేలకోట్ల విలువైన పొగాకు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. పొగాకుపై 18వ తేదీ ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో కిలో రూ.200 తగ్గకుండా కొంటామని చెప్పారని, ప్రస్తుతం రూ.160కి దిగజారిపోయిందని వివరించారు. నోబిడ్స్ కూడా కొనసాగుతున్నాయన్నారు. దీనివల్ల రైతులు పొగాకు అమ్ముకోవాలా వద్దా అనే డోలాయమానంలో పడిపోయారని తెలిపారు. బ్యారన్‌కు రూ.4 లక్షల నుండి రూ.6 లక్షల వరకూ నష్టపోతున్నారని పేర్కొన్నారు. రైతులు ఇంత తీవ్ర సంక్షోభంలో ఉంటే ముఖ్యమంత్రి వాగ్దానం వల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. గతేడాది కిలో రూ.280 లకు కొన్నారని, ఈ ఏడాది కనీసం రూ.250 అన్నా ఇవ్వాలని రైతులు కోరుతుంటే కనీసం రూ.200 కూడా ఇవ్వడం లేదని అన్నారు. జరిమానాలు, రైతుల ప్రీమీయం డబ్బు పొగాకు బోర్డులో రూ.1400 కోట్లు ఉందని, దీన్ని కేంద్ర ఖజానాలో కలుపుకొన్నారన్నారు. ఆ డబ్బు అయినా ఇచ్చి కొనుగోలు చేయాలని, అయినా కేంద్రం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకోవడం లేదని, మరి అలాంటప్పుడు సిఎం వాగ్దానాల వల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. డిఫరెన్షియల్ స్కీము పేరుతో మార్కెట్లో కొన్న మిర్చి, పొగాకు, మొక్కజొన్న ధరకు ప్రభుత్వం ప్రకటించిన ధరకు మధ్య వ్యత్యాసం ఉంటే చెల్లిస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు అమలు చేయలేదని, ఇస్తామన్న రైతులకూ ఇవ్వలేదని తెలిపారు. తక్షణం రాష్ట్రం కేంద్రంతో మాట్లాడి వెయ్యికోట్లు పొగాకు సొసైటీకి ఇస్తే ఐటిసి గుత్తాధిపత్యాన్ని దెబ్బకొట్టొచ్చని అన్నారు. దీనివల్ల మార్కెట్లో ధర పెరుగుతుందని తెలిపారు. పంట పెరిగిందని, యుద్దం అని, పన్ను వేశారని ఇన్ని సాకులు చెబుతున్న ఐటిసికి ఇటీవల కాలంలో రూ.7000 కోట్ల లాభాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. షేరు విలువా పెరిగిందని, కానీ రైతులకు ఏం మిగిలిందని అన్నారు. రైతులపై భారాలు వేసి వారిని పీల్చిపిప్పి చేస్తున్నారని అన్నారు. వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోవాలని కోరారు.
కౌలు రైతులను ఆదుకోండి
అలాగే యూరియా విషయంలో డబుల్ ఇంజన్ సర్కారు కౌలు రైతుల నడ్డి విరుస్తోందని విమర్శించారు. యాప్ ద్వారా సరఫరా చేస్తామని కాకినాడ, కృష్ణాజిల్లాల్లో కేంద్ర పథకం కింద, మిగిలిన జిల్లాల్లో రాష్ట్ర పథకం కింద ఏడాదికి మూడు దఫాలుగా ఇస్తామని చెప్పారని, దీనికి అనేక ఆంక్షలు పెడుతున్నారని పేర్కొన్నారు. పైగా యూరియా బ్లాక్ మార్కెట్‌కు వెళుతోందని, వెళితే అది బడా వ్యాపారులు, ప్రభుత్వం నుండే వెళ్లాలి తప్ప రైతులనుండి వెళ్లదని, అయినా రైతులపై తప్పు వేసి శిక్షిస్తున్నారని విమర్శించారు. మరీ ముఖ్యంగా కౌలు రైతులకు యూరియా ఇవ్వడం లేదని, దీంతో బ్లాక్ మార్కెట్లో కోనుగోలు చేయాల్సి వస్తోందని తెలిపారు. రాష్ట్రంలో 25 లక్షల మంది కౌలు రైతులు ఉంటే 1.25 లక్ష లమందికి మాత్రమే కార్డులు ఇచ్చారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కౌలు రైతులు, రైతులకు యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ బస్సులు ఆర్టీసికే ఇవ్వాలి
ఆర్‌టిసిలో 1000 విద్యుత్ బస్సులు ప్రవేశపెడుతున్నామని, వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని తెలిపారు. దీనికి 60 శాతం కేంద్రం సబ్సిడీ ఇస్తోందని, దాన్ని ఆర్‌టిసికి ఇచ్చి సంస్థే నిర్వహించేలా చూడాలని కోరారు. కార్పొరేట్ కంపెనీలకు లాభం కోసం ఆర్‌టిసిని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే విజయవాడలో విద్యాధరపురం, నెల్లూరు తదితర 12 డిపోలు ఇచ్చారని, ఆస్తులూ లీజు పేరుతో అప్పగిస్తున్నారని అన్నారు. ప్రైవేటు బస్సులు పెరిగితే స్త్రీశక్తి పథకం అమలు కూడా జరగదని పేర్కొన్నారు. బస్సుల ప్రైవేటీకరణతో ప్రయాణికులపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఇది ఆర్‌టిసి సమస్య కాదని, మొత్తం ప్రజల సమస్యని అన్నారు. విద్యుత్ బస్సులు తీసుకుని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపాలని సూచించారు. ప్రజా రవాణా పెరగకుండా ప్రైవేటు రవాణా పెరిగితే డీజిల్ సంక్షోభం కూడా ఎదుర్కోవాల్సి వస్తోందని అన్నారు.
మున్సిపల్ సేవలు కొనసాగాలి ` ఆస్తుల్ని కాపాడాలి
మరోవైపు మున్సిపల్ కార్మికులు త్రీవ ఆందోళనలో ఉన్నారని, సేవలు, ఆస్తులు ప్రైవేటుపరం చేస్తున్నారని తెలిపారు. దీనికోసం విడుదల 673, 975 చేసిన జిఓలు రద్దు చేయాలని కోరారు. మున్సిపల్ సేవల ప్రైవేటీకరణ వల్ల ప్రజలపై పెనుభారం పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో తమ భద్రత కోసం, ఆస్తుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మున్సిపల్ కార్మికులు చేస్తున్న ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పిఆర్‌సి వేయాలని, స్కీమ్, మున్సిపల్ తదిరత కార్మికుల వేతనాలు పెంచాలని కోరారు. వారి ఆందోళనలకు సిపి¾యం తరపున మద్దతు ప్రకటించారు.
విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ పాలన అద్భుతంగా ఉందని ఎవరికి వారు సర్టిఫికెట్ ఇచ్చుకోవడంలో అభ్యంతరం లేదని, అది బాగుందా లేదా అని తేల్చాల్సింది ప్రజలని పేర్కొన్నారు. అలాగే సాయికృష్ణ, క్రాంతికుమార్ విషయంలో న్యాయ విచారణ జరిపించాలని డిమాండు చేశారు. ఈ వ్యవహారంలో సిట్ ఒక కోణంలో పరిశీలించొచ్చని, న్యాయ విచారణ జరిగితే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. రాష్ట్రంలో చాలా చోట్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత తీరు చూస్తే పారదర్శకంగా విచారణ జరుగుతుందనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దళితులపై దాడులు జరిగితే పోలీసులే రాజీ చేసి మరలా దళితులపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు వ్యవస్త అస్త వ్యస్తంగా తయారైందని, దీన్ని పూర్తిగా సంస్కరించాల్సి ఉందని అన్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నాగరాజు ఏమీ చెప్పలేదని చెబుతున్నారని, మరి అలాంటప్పుడు పోలీసు కస్టడీ ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. ఈ కేసులో విచారణ నిష్పక్షపాతంగా జరగాలని కోరారు.








కామెంట్‌లు (0)