ఆదివారం, 27 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఐరాసలో భారత శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు..

4 గంటల క్రితం

india
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 11:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూయార్క్ : ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు రష్యా మద్దతు తెలిపింది. ఈ మేరకు న్యూయార్‌ జరుగుతున్న 81వ ఐరాస సర్వప్రతినిధి సభ సమావేశాల్లో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ కీలక ప్రకటన చేశారు. భద్రతా మండలిలో ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు ప్రాతినిధ్యం పెంచాల్సిన అవసరం ఉందని సెర్గీ లవ్రోవ్ అన్నారు. భారత్‌తో పాటు బ్రెజిల్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్ను తాము పూర్తిగా సమర్థిస్తున్నట్టు వెల్లడించారు. ప్రపంచ వ్యవహారాల్లో ఆయా ప్రాంతాల ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. భద్రతా మండలి సంస్కరణల్లో భాగంగా గ్లోబల్‌ సౌత్‌ దేశాలకు మరిన్ని సీట్లు కేటాయించాలని రష్యా వాదించింది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాల ప్రాతినిధ్యాన్ని విస్తరించేందుకు తాము అనుకూలంగా ఉన్నామని సెర్గీ లవ్రోవ్‌ తెలిపారు. శాశ్వత సీటు కోసం బ్రెజిల్‌, భారతదేశాల అభ్యర్థిత్వాలకు తాము మద్దతు ఇస్తున్నామని ఆయన అన్నారు. అదే సమయంలో పశ్చిమ దేశాలకు అదనపు శాశ్వత సభ్యత్వాలు కల్పించాలన్న ప్రతిపాదనను సెర్గీ లవ్రోవ్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా జర్మనీ, జపాన్‌లకు భద్రతా మండలిలో అదనపు సీట్లు ఇవ్వకూడదని ఆయన అన్నారు. జర్మనీ, జపాన్‌లు ప్రస్తుతం సైనికీకరణ, ప్రతీకారవాదం దిశగా పయనిస్తున్నాయని సెర్గీ లవ్రోవ్‌ ఆరోపించారు. భద్రతా మండలిని ఆధునికీకరించే క్రమంలో ప్రస్తుతం శాశ్వత సభ్య దేశాలకు ఉన్న కీలక అధికారాలను ఏమాత్రం తగ్గించకూడదని స్పష్టం చేశారు. ప్రస్తుత శాశ్వత సభ్యుల హక్కులు, అధికారాలను నీరుగార్చే విధంగా సంస్కరణలు ఉండకూడదని హెచ్చరించారు. ప్రస్తుతం ఐరాస భద్రతా మండలిలో మొత్తం 15 మంది సభ్యులు ఉంటారు. వీరిలో చైనా, ఫ్రాన్స్‌, రష్యా, యూకే, అమెరికా అనే ఐదు దేశాలు శాశ్వత సభ్యులుగా ఉన్నాయి. వీటికి వీటో అధికారం ఉంది. మరో పది దేశాలు రెండేళ్ల కాలానికి ఎన్నికైన తాత్కాలిక సభ్యులుగా ఉంటాయి. భారత్‌కు రష్యాతోపాటు మారిషస్‌ కూడా మద్దతు తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్