- ఘనంగా రొట్టెల పండగ ప్రారంభం
- స్వర్ణాల చెరువు జనసందోహం
ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి: మతసామరస్యానికి ప్రతీకైన రొట్టెల పండగ శుక్రవారం నెల్లూరులో ఘనంగా ప్రారంభమైంది. కులమతాలకు అతీతంగా దేశ, విదేశాల నుంచి యాత్రికులు తరలివచ్చారు. ఉదయం నుంచి స్వర్ణాల చెరువు జనసందోహంతో నిండిపోయింది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ తేడా లేకుండా రొట్టెలు పంపిణీ చేసుకున్నారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. తమిళనాడు, కేరళం, కర్ణాటక, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి సుదూర ప్రాంతాల నుంచి బస్సులు, కార్లు, లారీల్లో యాత్రికులు నెల్లూరు తరలివచ్చారు. మొహరం కావడంతో 12 మంది మృతవీరులకు గుర్తుగా ఉన్న బారాషాహీద్ దర్గాను సందర్శించుకున్నారు. హిందువులకు ముస్లిములు, ముస్లిములకు హిందువులు, క్రైస్తవులకు హిందువులు, హిందువులకు క్రైస్టవులు, ముస్లిములకు క్రైస్తవులు, క్రైస్తవులకు ముస్లిములు రొట్టెలు ఇచ్చిపుచ్చుకోవడంతో మతసామరస్యం వెల్లివిరిసింది. తొలిరోజు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరై రొట్టెలు పట్టుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ బారా షాహీద్ దర్గా వద్ద నిర్వహిస్తున్న రొట్టెల పండగను రాష్ట్ర పండగగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలోనే గుర్తింపు ఇచ్చారన్నారు. ఈ ఏడాది సుమారు 15 లక్షల మంది రానున్నారని తెలిపారు. టూరిజం హబ్ గా నెల్లూరు బారా షాహిద్ దర్గాను తీర్చిదిద్దుతున్నామన్నారు. 6,315 మంది మున్సిపల్ శాఖ సిబ్బంది, 1,870 పోలీసులు, గజ ఈతగాళ్లు, బోట్ షికారు కోసం ఎనిమిది బోట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. దేశవిదేశాలు, సుదూర ప్రాంతాలు, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. ఐదు రోజుల పండగ తర్వాత కూడా మరో ఐదు రోజులు యాత్రికులు వస్తూనే ఉంటారని తెలిపారు. తొలి రోజు పండగలో కలెక్టర్ హిమాన్హు శుక్లా, ఎస్‌పి అజితా వేజెండ్ల, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నగర మేయర్ సుజాత, నగరపాలక సంస్థ కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, రొట్టెల పండగ చైర్మన్ మునీర్ అహ్మద్, మైనారిటీ నాయకులు, సయ్యద్ షమీ తదితరులు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)