mh ad
ఆదివారం, 28 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకంపెనీల కోసమే 'స్వర్ణగిరి'

1 గంట క్రితం

swarnagiri
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 05:15 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

- వి. రాంభూపాల్‌

కర్నూలు జిల్లాలోని జొన్నగిరి, బొల్లవానిపల్లె, పగిడిరాయి గ్రామాల వ్యవసాయ భూముల్లో అత్యంత విలువైన బంగారు నిక్షేపాల పరిశోధన పూర్తయి, బంగారం బయటకు వచ్చింది. జియో మైసూర్‌ గోల్డ్‌ ప్రాజెక్టు రెండవ యూనిట్‌కు జూన్‌ 24న రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జొన్నగిరి పేరును స్వర్ణగిరిగా మార్చేశారు. రాయలసీమ ఇక రతనాలసీమ అంటూ కీర్తించారు. అయితే దేశంలోనే అతి పెద్ద బంగారు నిక్షేపాలు వున్నందుకు ఈ ప్రాంతానికి లేదా రాష్ట్రానికి జరిగే మేలు ఏమిటో ఆయన చెప్పలేదు. ఇందులో రైతుల వాటా నామమాత్రం, ప్రభుత్వ ఆదాయం అతి కనిష్టం, కంపెనీలకు మాత్రం కనక వర్షం. రైతుకు ఎకరానికి రూ.12 నుండి రూ.16 వేలు కౌలు ఇస్తూ, మొదటి ఏడాది ఉత్పత్తి అయ్యే 400 కిలోల బంగారంలో రాష్ట్ర ప్రభుత్వానికి 4 శాతం రాయల్టీ రూ. 57 కోట్లు చెల్లిస్తూ, కంపెనీలు మాత్రం సుమారు రూ. 600 కోట్లు తరలించుకుపోతాయి. రెండవ ఏడాది ప్రభుత్వానికి రూ. 144 కోట్లు, కంపెనీలకు రూ.1,422 కోట్లు. రైతుల నోట్లో మట్టిగొట్టి కంపెనీలకు స్వర్ణగిరిగా మారే ఇలాంటి 'అభివృద్ధి'ని చూసి ప్రజలు మురిసిపోవాలా? భూమి కోల్పోయిన గ్రామీణులకు ఉద్యోగాలు ఇస్తారో, లేదో సి.ఎం చెప్పలేదు. ఇప్పటికే సోలార్‌ కంపెనీలు వేల ఎకరాల భూముల్లో విద్యుత్‌ ఉత్పత్తి చేసుకుని వేల కోట్లు తరలించుకుతుంటే, గ్రామాల్లో పనులు లేక, పట్టణాలకు వెళ్ళి బతకలేక రైతులు, కూలీలు చచ్చిబతుకుతున్నారు. 'అంగట్లో అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని వుందన్నట్లు'గానే సీమ ప్రజల పరిస్థితి మారనుందా? క్రిష్ణా గోదావరి బేసిన్‌ లోని చమురులో రాష్ట్రానికి రావలసిన వాటా ఇవ్వకుండానే రిలయన్స్‌ లాంటి కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలించుకుపోతున్నాయి. మచిలీపట్నం, ప్రకాశం జిల్లాలోని సహజ వనరులు, అనకాపల్లి, విశాఖ జిల్లాలోని ముడి ఇనుము ప్రైవేట్‌ కంపెనీలు స్వంతం చేసుకుంటున్నాయి. రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడాల్సిన ఈ వనరులు దేశీయ, విదేశీ కంపెనీల చేతుల్లోకి వెళ్తుంటే, ఊరి పేర్లు మారిస్తే ప్రయోజనం ఏమిటి?

ఈ బంగారు నిక్షేపాలు వున్న ప్రాంతంలోని ఎర్రగుడి గ్రామం వద్ద క్రీ.పూ 3వ శతాబ్దం నాటి అశోకుడి శిలాశాసనాలు వున్నాయి. అశోకుని దక్షిణ భారత రాజ్యానికి సువర్ణగరి (ప్రస్తుత జొన్నగిరి) రాజధానిగా వుండేది. పగిడిరాయి గ్రామం కూడా చారిత్రాత్మకమైందే. కాలక్రమంలో భౌగోళిక కారణాలు, పాలకుల విధానాల ఫలితంగా ఈ ప్రాంతం కరువుల నిలయంగా మారింది. జొన్నగిరిలోని అతి పెద్ద చెరువు దశాబ్దానికి ఒక్కసారి కూడా పూర్తి స్థాయిలో నిండక, ఆయకట్టు భూములు సాగుకు దూరమై చాలా కాలమైంది. ఈ చెరువు నిండకపోవడంతో దాని కింద వున్న ఎర్రగుడి గ్రామంలో అత్యధిక సాగునీటి బావులు ఎండిపోయి మెట్టపొలాలుగా మారిపోయాయి. బొల్లవానిపల్లె గ్రామం నుండి అనేక మంది గుత్తి, బెంగళూరుకు వలసలు వెళ్లిపోతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ లభ్యమయ్యే బంగారం ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడాలని కోరుకోవడం సహజ న్యాయం. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం ప్రభుత్వాల కనీస బాధ్యత.

గద్దల్లా వాలిన ప్రైవేట్‌ కంపెనీలు

ఈ ప్రాంతంలో బంగారు నిక్షేపాలున్నాయని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జి.ఎస్‌.ఐ) 2008-09 నుంచి సర్వే నిర్వహించి, పలు పరిశోధనలు చేసింది. జొన్నగిరి, బొల్లవానిపల్లె, పగిడిరాయి గ్రామాల పరిధిలో ఈ నిక్షేపాలు వున్నట్లు 2012 నాటికి నిర్ధారించింది. ఆ వెంటనే ప్రైవేట్‌ కంపెనీలు 2014లో గద్దల్లా వాలాయి. ప్రభుత్వాల్లో తమ పలుకుబడిని ఉపయోగించి, రైతులను మభ్యపెట్టి స్వంత సర్వేలు చేయించుకుని పూర్తి అంచనాకు వచ్చాయి. 1,477.24 ఎకరాల్లో తవ్వకాలకు జియో మైసూర్‌ సర్వీసెస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ప్రభుత్వ అనుమతులను పొంది, మట్టి తవ్వకాలను మొదలు పెట్టింది. టన్ను మట్టిలో దాదాపు 1.5 గ్రాముల నుంచి 2 గ్రాముల వరకూ బంగారం ఉత్పత్తి అవుతుందని, ఇందుకు రూ.4,000 నుంచి రూ.5,000 వరకు ఖర్చవుతుందని, వచ్చే పదేళ్లలో దాదాపు 6,000 టన్నుల బంగారం ఉత్పత్తి చేయవచ్చని ఈ కంపెనీ అంచనా వేసింది. భూమి అడుగున 800 మీటర్ల నుంచి 2 కిలోమీటర్ల లోతు వరకు బంగారు ఖనిజం ఉన్నట్లుగా ఈ కంపెనీ గుర్తించింది. జియో మైసూర్‌ సంస్థ దక్కన్‌ గోల్డు మైన్స్‌, త్రివేణి ఎర్త్‌ మూవర్స్‌ అనే మరో రెండు కంపెనీలను భాగస్వాములుగా చేసుకుని తవ్వకాలు ప్రారంభించింది. రూ.450 కోట్ల పెట్టుబడులతో 700 మందికి ప్రత్యక్షంగా, వేలాది మందికి పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయని, భూమి కోల్పోయిన రైతు కుటుంబాలకు, స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు ఇస్తామని అటు కంపెనీలు, ఇటు ప్రభుత్వ అధికారులు ప్రచారం చేశారు. ఈ బంగారు గనులకు అవసరమైన నీటిని హంద్రీ నీవా కాలువ నుండి 0.21 టిఎంసీల నీటిని 18 కిలోమీటర్ల పైపులైన్‌ ద్వారా తరలించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

రైతులను వంచించిన కంపెనీ

నిక్షేపాల పరిశోధనలో భాగంగా డ్రిల్లింగ్‌ చేసేందుకు ఎకరం భూమికి సంవత్సరానికి 6 వేల నుండి 12 వేల రూపాయలతో 2017-18లో జియో మైసూర్‌ కంపెనీ రైతులతో కౌలు ఒప్పందాలు చేసుకుంది. డ్రిల్లింగ్‌ స్థలంలో మాత్రం సహకరించి మిగిలిన పొలంలో పంట సాగు చేసుకోవచ్చని రైతులను నమ్మించింది. అయితే వేల అడుగుల డ్రిల్లింగ్‌ పదేపదే చేయడం వల్ల, ఆ దుమ్ముతో పంట పొలాలు దెబ్బ తింటుండంతో రైతుల్లో వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలో 2018-19 సంవత్సరానికి గాను కౌలును మరింత పెంచుతూ ఎకరాకు రూ.16,500 చెల్లిస్తామని, తర్వాత ఎకరం 12 నుండి 18 లక్షల వరకు కొనుగోలు చేస్తామని చెప్పారు. ఈ మూడు గ్రామాల్లోని పలుకుబడి కలిగిన, అధికార పార్టీలకు చెందిన కొందరిని చేరదీసి వారి భూములను అధిక ధరకు కొనుగోలు చేసి కంపెనీలు లోబరచుకున్నాయి. పగిడిరాయి గ్రామంలో ఒక నాయకుడి భూమికి ఎకరం 40 లక్షలతో, బొల్లవానిపల్లెలో మరో నాయకుడి భూమిని 18 లక్షలతో కొనుగోలు చేసినట్లు ఈ గ్రామాల ప్రజలు చెబుతున్నారు. పొరుగున వున్న గుత్తి మండలంలోని బేతాపల్లి, యంగన్నపల్లి గ్రామాల్లోని సోలార్‌ కంపెనీలు చేసిన బలవంతపు భూసేకరణను చూపి, కంపెనీ అడిగిన ధరకు అమ్మకపోతే మనకు అలాగే జరుగుతుందని ఈ దళారులు రైతులను భయపెట్టారు. వరుస కరువులతో ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు ప్రభుత్వ బెదరింపులతో భూములు అమ్ముకోవడానికి రైతులు ముందుకు వచ్చారు. ఎంత భూమి తీసుకుంటామనేది చెప్పకుండానే దాదాపు అందరూ రైతుల నుండి పట్టాదారు పాసుపుస్తకాలు తీసుకుని కొనుగోలు చేస్తున్నట్లు మూడు, నాలుగు సంవత్సరాలు కంపెనీ మభ్యపెట్టింది. ఈలోపు సర్వే పూర్తి చేసుకుని తమకు కావలసిన భూమిని నిర్ణయించుకుంది. ఈ విషయం తెలియని రైతులు తమ భూమిని కంపెనీ కొంటుందని పొరుగున వున్న గ్రామాల్లో పొలం కొనేందుకు అడ్వాన్సులు ఇచ్చి ఒప్పందాలు చేసుకున్నారు. చావు కబురు చల్లగా చెప్పినట్లు 60 ఎకరాల్లోనే బంగారు నిక్షేపాలు వున్నాయని, ప్రధాన పరిశ్రమతో పాటు ఇతర కార్యక్రమాలకు అవసరమైన మరో 290 ఎకరాలు మొత్తం 350 ఎకరాలు మాత్రమే తమకు చాలని కంపెనీ ఇప్పుడు అంటుంది.

మిగిలిన 1100 ఎకరాల భూమికి కౌలు ఇస్తామంటుంది. కౌలు పెంచకపోగా, ఏదో సాకు చెప్పి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కౌలు ఇవ్వకుండా తక్కువ ధరకు భూమిని అమ్ముకునే విధంగా రైతుల మీద ఒత్తిడి తెస్తున్నారు. పక్క గ్రామాల్లో భూమి కొనడం కోసం అడ్వాన్స్‌ ఇచ్చిన రైతులు ఇక్కడ భూమి అమ్ముడుపోక, అక్కడ ఇచ్చిన అడ్వాన్స్‌లు తిరిగి రాక ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. ఉదాహరణకు బొల్లవాని పల్లె గ్రామానికి చెందిన పోతురాయి రంగారెడ్డి అనే రైతుకు చెందిన 8 ఎకరాల భూమిని కొంటున్నట్లు కంపెనీ ధర మాట్లాడుకుంది. దీంతో ఆ రైతు అనంతపురం జిల్లాలోని పెద్ద వడుగూరు గ్రామంలో 10 ఎకరాల భూమి కొనుగోలుకు అడ్వాన్సు ఇచ్చి నష్టపోయాడు. ఇలా ఒకరిద్దరు కాదు, అనేకమంది వున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

ఉద్యోగాలు ఒట్టి మాట

భూమి కోల్పోయిన రైతు కుటుంబాలకు కంపెనీలో ఇస్తామన్న ఉద్యోగాలు ఇస్తున్న పరిస్థితి లేదు. బీహార్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుండి కార్మికులను తెచ్చి పని చేయించుకుంటున్నారు. సాంకేతిక శిక్షణ ఇచ్చి స్థానికులను తీసుకుంటామని ఒకవైపు చెబుతూ ఎలాంటి శిక్షణ ఇవ్వడం లేదు. వా‌చ్‌మెన్‌లుగా, స్వీపర్లుగా కాంట్రాక్టు ఏజెన్సీల ద్వారా కొద్దిమందిని మాత్రమే తీసుకున్నారు. 700 ఎకరాల భూమిని కోల్పోయిన బొల్లవానిపల్లె గ్రామం నుండి 30 మందిని మాత్రమే ఈ కంపెనీ రోజువారి కూలీలుగా పని చేయించుకుంటుంది. వీరికి మధ్యా‌హ్న భోజనం పెట్టి రూ. 500 కూలి ఇస్తున్నారు. బొల్లవానిపల్లె గ్రామానికి చెందిన రామచంద్రా రెడ్డి తన కొడుకు మహేశ్వర రెడ్డికి ఈ కంపెనీలో ఉద్యోగం వస్తుందని అందరి కంటే ముందుగా భూమి ఇచ్చాడు. ఏళ్ళు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో మహేశ్వర రెడ్డి బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చి మంచంలో వున్నా కంపెనీ పట్టించుకోవడంలేదు. కర్నూలు జిల్లా సిపిఎం ప్రతినిధి బృందం ఈ గ్రామాల్లో పర్యటించి స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చినా స్పందన లేదు.

కేంద్ర ప్రభుత్వం నుండి సర్వే, రాష్ట్ర ప్రభుత్వం నుండి భూమి, నీరు పొంది, రైతులను భూమి నుండి తరిమేసి, ఇక్కడి విలువైన వనరులను ప్రైవేట్‌ కంపెనీలు తరలించు‌కుపోతుంటే రాయలసీమ స్వర్ణసీమ ఎలా అవుతుంది?​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్