ప్రజాశక్తి-అమరావతి : పిజి వైద్య విద్యార్థులతో నిరంతరాయంగా 36 గంటలు ఎలా పనిచేయిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. అత్యవసర పరిస్థితుల్లో 72 గంటలు కూడా పనిచేయించడం గురించి తెలుసుకున్న హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వార్డుల్లోకెళ్లి చూస్తే పిజి వైద్య విద్యార్థుల దయనీత పరిస్థితి కనబడుతుందని వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితుల్లో మార్పుల కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారో వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ లీసా గిల్, జస్టిస్ నైనాల జయసూర్యతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం ఆదేశించింది. విరామం లేకుండా 36 గంటలపాటు నిరంతరాయంగా పనిచేయించడం చట్ట వ్యతిరేకమని పేర్కొంటూ గుంటూరుకు చెందిన ప్రముఖ వైద్యులు ఆలా వెంకటేశ్వర్లు పిల్ దాఖలు చేశారు. న్యాయవాది ఠాకూర్ యాదవ్ వాదిస్తూ.. రూల్స్ ప్రకారం పిజి వైద్య విద్యార్థులు 12 గంటలకు మించి పని చేయడానికి వీల్లేదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 24 గంటలకు మించి పనిచేసేందుకు వీల్లేదన్నారు. ప్రభుత్వ న్యాయవాది కల్యాణ్ ప్రతివాదన చేస్తూ.. అన్ని కాలేజీల్లో 36 గంటల పాటు పనిచేయడం లేదని, రంగరాయ కళాశాలలోనే ఈ పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వ వివరణ కోసం విచారణ వాయిదా పడింది.
పిజి వైద్య విద్యార్థులతో 36 గంటల పని
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 18, 2026, 12:25 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)