సిపిఎం 24 గంటల నిరాహార దీక్ష ముగింపు సభలో వక్తల పిలుపు
ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ రూరల్ లోని విలీన గ్రామాలను కార్పొరేషన్ లో విలీనం చేయాలనే ఉద్యమంలోకి సిటీ, రూరల్ పౌర సమాజాన్ని మరింత భాగస్వామ్యం చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు ముందే ఆరు గ్రామాలను విలీనం చేయాలని సిపిఎం నిర్వహిస్తున్న నిరవధిక పోరాటంలో భాగంగా స్థానిక కలెక్టరేట్ వద్ద జరిపిన 24 గంటల నిరాహార దీక్షలు మంగళవారం ఉదయం ముగించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన వక్తలు ప్రసంగిస్తూ సమాజంలోని వివిధ తరగతులను, సామాజిక శక్తులను, పౌర సంఘాలను చైతన్య పరిచి మహత్తర ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లడానికి ఒక కృషి జరపాలని వారు కోరారు. గ్రామాలు విలీనం కాకుండా కాకినాడ కార్పొరేషన్ గ్రేటర్ కార్పొరేషన్ గా విస్తరింప జేసే అవకాశాలు ఉండవని, అలాగే గ్రామాలు కార్పొరేషన్లో విలీనం కాకుండా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పన సాధ్యం కాదని, ఉభయ ప్రయోజనాలు సాధనకు ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమంలోకి వచ్చి విలీన గ్రామాల ఉద్యమాన్ని ఒక ప్రజా ఉద్యమంగా తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఇందుకు తమ వంతు పాత్ర నిర్వహిస్తామని చెప్పారు. దీక్షలు విరమింప చేయడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ న్యాయవాది జవహర్ ఆలీ, సామాజిక విశ్లేషకులు యరమాటి పాపారావు, అంబేద్కర్ వాది అయితాబత్తుల రామేశ్వరరావు, సిఐటీయు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జి, న్యాయవాది నాగజ్యోతి, పౌర సంక్షేమ సంఘం అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు దీక్షాపరులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. సిపిఎం మండల కమిటీ కన్వీనర్ తిరుమలశెట్టి నాగేశ్వరరావు వందన సమర్పణ చేస్తూ గ్రామాల విలీనంపై ప్రభుత్వ వైఖరిని బట్టి భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామన్నారు. విలీన అంశాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లి సహకరించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు, ప్రభుత్వ యంత్రాంగానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేసారు. దీక్షలో కూర్చున్న అజయ్ కుమార్, విజయ్ కుమార్, చందర్రావు, రాజా, సత్యనారాయణరెడ్డి, నాగదేవి, మహాలక్ష్మి, అమ్మాజీలకు అభినందనలు తెలియజేశారు. సభకు అధ్యక్షత వహించిన పెద్దింశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ తదుపరి పోరాట కార్యక్రమాన్ని ప్రకటిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు సత్యం, రోహిత్, యువజన సంఘం నాయకులు త్రిమూర్తులు, కార్మిక సంఘం నాయకులు జుత్తుగ శ్రీనివాసరావు, శ్రీను, విజయ, పారిశ్రామిక ప్రాంతం కార్మిక నాయకులు రామకృష్ణ, నాగేంద్ర, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)