కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలి ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ డిమాండ్
ప్రజాశక్తి - కడప అర్బన్ : జిల్లాలో అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి యుద్ధ ప్రాతిపదికన కరువు సహాయక చర్యలు చేపట్టాలని సిపిఎం కడప జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ఎల్ నినో ప్రభావిత కడప జిల్లాలో కరువు రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలిపారు. జిల్లాలో తగినంత వర్ష పాతం నమోదు గాక పంటల సాగు ఆగిపోయిందని చెప్పారు. ఇప్పటికే కరువు చాయలు అలుముకున్నాయని పేర్కొన్నారు. భూగర్భ జలాలు పడిపోతున్నాయని తెలిపారు. తక్షణం ప్రభుత్వం కరువు బృందాలను పంపి కరువు అంచనా వేసి కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కరువు పరిస్థితి పై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర కరువు నివేదిక పంపి అత్యవసర ఆర్థిక సహాయం కోరాలని అన్నారు. ప్రభుత్వ గణాంకాలతో పాటు క్షేత్రస్థాయి వాస్తవాలను ఆధారంగా చేసుకుని సమగ్ర కరువు నివేదిక రూపొందించాలని, వెంటనే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి కరువు ప్రభావిత మండలాలో ప్రత్యేక కరువు ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని త్రాగునీటి ఎద్దడికి చెరువుల నింపుదల, ఆరుతడి పంటలకు నిరంధించి కరువు రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగు గంగ, కేసీ కెనాల్ కు నీటి కోసం జిల్లా ప్రజా ప్రతినిధులు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని కోరారు. రైతుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కరువు ప్రభావిత ప్రాంతాలలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. రబీ సీజన్లో రైతులకు 90 శాతం సబ్సిడీతో విత్తనాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కరువు ప్రభావిత ప్రాంతాల్లో వ్యవసాయ కార్మికులకు తక్షణ ఉపాధి అవకాశాలు కల్పించాలని, కరువు పనులు కల్పించి రోజుకు 600 చొప్పున వేతనం చెల్లించాలని ఆయన తెలిపారు. కరువు రైతాంగం పట్ల నిర్లక్ష్యం వహిస్తే రానున్న కాలంలో దశల వారి పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. ధర్నా కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎ.రామ్మోహన్, మనోహర్, అన్వేష్, శివకుమార్, దస్తగిరి రెడ్డి, సత్యం, శ్రీనివాసులు రెడ్డి, చాంద్ బాషా, లక్ష్మీదేవి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గోపాలకృష్ణయ్య, పార్టీ నాయకులు నారాయణరెడ్డి, ఐ.ఎన్.సుబ్బమ్మ, చిన్న సిద్దయ్య, రఘు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నరసయ్య, సురేష్ తో పాటు వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)