బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘ఆ తల్లి’ నిర్ణయానికి తలొగ్గక తప్పదు : మద్రాస్‌ హైకోర్టు

1 గంట క్రితం

Madras HC
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 05:32 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

చెన్నై : అసాధారణ లోపాలతో ఉన్న శిశువుకు జన్మనివ్వకూడదని ఒక తల్లి తీసుకున్న అత్యంత బాధాకరమైన నిర్ణయానికి కోర్టు కూడా తలొగ్గక తప్పదని, ఆ తల్లికి గర్భస్రావానికి మద్రాస్‌ హైకోర్టు అనుమతించింది. మెదడు వైకల్యం ఉన్నవారికి ముఖ్యంగా సాధారణ జీవనం గడపలేని శిశువుకు జన్మనివ్వకూడదని నిర్ణయం తీసుకునే హక్కు తల్లికి ఉందని జస్టిస్‌ పి.టి.ఆశా పేర్కొన్నారు. ఒక బిడ్డ గౌరవప్రదంగా, స్వయంగా జీవితాన్ని గడపలేకపోవడంతో ఉన్న గణనీయమైన ప్రమాదాన్ని పరిగణనలోకి తీసుకుని, అత్యంత బాధాకరమైన, తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకున్న పిటిషనర్ నిర్ణయానికి ఈ కోర్టు కూడా తలొగ్గక తప్పదని తెలిపింది.

“అసాధారణ లోపాలతో పుట్టిన శిశువు ప్రతి రోజూ అనుభవించే బాధను తల్లిదండ్రులే కళ్లారా చూడాల్సివుంది. దీంతో గౌరవప్రదమైన జీవితాన్ని గడపలేని శిశువు ఈ ప్రపంచంలోకి రాకూడదనే ఉద్దేశంతోనే తల్లిదండ్రులు ఆ నిర్ణయం తీసుకున్నారు. అలాగే పుట్టబోయే శిశువుకు కూడా గౌరవప్రదంగా జీవించే హక్కు ఉంది. ఆ శిశువు ఇతరుల ఎగతాళికి గురికాకూడదు. తల్లిదండ్రుల జీవితకాలం ముగిసిన తర్వాత, ఆశిశువు జీవితం ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా ఈ కోర్టు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది’’ అని పేర్కొంది.

వివరాల ప్రకారం.. రిట్‌ పిటిషనర్‌, ఆమె భర్తకు 2024లో ఒక కుమారుడు జన్మించాడు. ఇది పిటిషనర్‌కు రెండవ గర్భం. మూడునెలల స్కానింగ్ నివేదికలో మెదడులో చిన్నపాటి సమస్య ఉన్నట్లు గుర్తించారు. రెండవ సారి స్కానింగ్‌లో కూడా ఈ సమస్య ఉన్నట్లు నిర్థారణైంది. అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో పుట్టుకతో వచ్చే మెదడు వైకల్యం, రెండు వైపులా మధ్యస్థ స్థాయి వెంట్రిక్యులోమెగాలీని గుర్తించారు. దీంతో పుట్టిన బిడ్డలో మెదడు వైకల్యం, సాధారణంగా జీవించలేకపోవడం, మాట్లాడలేకపోవడం, మూర్ఛ వంటి ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిర్థారణైంది. అలాగే పుట్టుకకు ముందే వైకల్యం తీవ్రతను కచ్చితంగా అంచనా వేయడం సాధ్యం కాదని, ఇతర మెదడు రుగ్మతలు, జన్యుపరమైన లోపాలు ఉంటే ప్రమాదం మరింత పెరుగుతుందని వెల్లడించారు. అయితే గర్భస్థ శిశువులోని నరాల సంబంధిత సమస్యలు ప్రాణాంతకం కాదని వైద్య మండలి సూచించడంతో, చెన్నైలోని ఎగ్మోర్‌లో ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, ప్రభుత్వ మహిళా శిశు ఆసుపత్రి ఛైర్‌పర్సన్ గర్భాన్ని తొలగించడానికి నిరాకరిస్తూ అక్టోబర్ 13న ఉత్తర్వులు జారీచేసింది. దీంతో వారు కోర్టును ఆశ్రయించారు. వారి వాదనలు విన్న కోర్టు .. అప్పటికే 24 వారాలు దాటినందున, వెంటనే గర్భాన్ని తొలగించాలని ఆమె ఆదేశించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్