సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

దద్దరిల్లిన కలెక్టరేట్లు..

1 గంట క్రితం

protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 25, 2026, 12:36 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

• సమస్యల పరిష్కారానికి గళమెత్తిన దళితులు

• భూమి, ఇళ్ల స్థలాలు, ఉపాధి, విద్య, వైద్యం కోసం డిమాండ్‌

• డిసెంబరులో ‘చలో అమరావతి’ : డిఎస్‌ఎంఎం జాతీయ నాయకులు వి.శ్రీనివాసరావు

ప్రజాశక్తి - యంత్రాంగం : దళిత వాడల్లో మౌలిక వసతులు, భూమి, ఇళ్ల స్థలాలు, ఉపాధి, విద్య, వైద్యం తదితర సమస్యల పరిష్కారానికి రాష్ర్టవ్యాప్తంగా కలెక్టరేట్లను సోమవారం ముట్టడించారు. కెవిపిఎస్‌, వ్యవసాయ కార్మిక సంఘం, ఇతర ప్రజాసంఘాలు రెండు నెలలుగా నిర్వహించిన ‘సామాజిక శంఖారావం’ అధ్యయన యాత్రలో గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా నిర్వహించారు. దీంతో కలెక్టరేట్లు దద్ధరిల్లాయి. అధికారులే స్వయంగా వచ్చి సమస్యలపై పరిష్కారానికి హామీ ఇచ్చారు.

ఒంగోలులో కలెక్టరేట్‌ వద్ద ధర్నాలో దళిత్‌ శోషణ్‌ ముక్తి మంచ్‌ (డిఎస్‌ఎంఎం) జాతీయ నాయకులు వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ... దళితవాడల్లో తాగునీరు, రోడ్లు, ఇళ్లు, విద్య, వైద్యం వంటి కనీస సౌకర్యాల కోసం ప్రజలు పోరాడాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. చివరకు స్మశానవాటికల్లో అంత్యక్రియలు నిర్వహించడం లోనూ వివక్ష కొనసాగుతోందని వివరించారు. దళిత పారిశ్రామికవేత్తలకు రావాల్సిన సబ్సిడీ నిధులు విడుదల కాక వారు కుటుంబాలతో సహా రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అర్హులైన కుటుంబాలకు గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్ల ఇంటి స్థలం ఇస్తామన్న హామీ అమలుకు నోచుకోలేదని గుర్తు చేశారు. వెలుగొండ నిర్వాసితులకు పూర్తి నష్టపరిహారం, పునరావాసం కల్పించకుండా టెంట్లలో జీవించే పరిస్థితి కల్పించడం దారుణమన్నారు. జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ సిఫారసులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. దళితవాడల్లో నెలకొన్న సమస్యలను మరో మూడు నెలల్లో పరిష్కరించకపోతే డిసెంబరులో ‘చలో అమరావతి’ పేరుతో భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ధర్నావద్దకు వచ్చిన డిఆర్‌ఒకు అర్జీ ఇచ్చారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. బాపట్లలో డి.రమాదేవి మాట్లాడుతూ.. ప్రతి దళితవాడకు రెండు ఎకరాల స్మశానవాటికకు స్థలం కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ధర్నా శిబిరం వద్దకు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వచ్చి సమస్యలపై వినతి పత్రం తీసుకొని సమస్యలపై నాయకులతో మాట్లాడారు. ​శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా మూడు గంటల పాటు బైఠాయించి ఆందోళన కొనసాగించారు. పుట్టపర్తి ఆర్‌డిఒ నాయకుల వద్దకు వచ్చి మాట్లాడేందుకు ప్రయత్నించగా.. కలెక్టర్ వచ్చి తమ సమస్యను వినాలని నాయకులు పట్టుబట్టారు. కలెక్టర్ రాకపోవడంతో ఆందోళనకారులు కలెక్టరేట్‌ ‌ప్రధాన ద్వారా తలుపులు బలవంతంగా తెరిచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో కలెక్టర్ శ్యాం ప్రసాద్‌ ఆందోళనకారుల వద్దకొచ్చి మాట్లాడారు. జిల్లా పరిధిలో పరిష్కరించే సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతపురంలో సంగమేష్‌ ‌సర్కిల్‌‌నుంచి డప్పుల వాయిద్యాలతో కలెక్టరేట్‌ వరకూ ప్రదర్శన నిర్వహించారు. అర్జీలను చేతబట్టుకుని కలెక్టరేట్‌ ‌ముందు బైటాయించి ధర్నా చేశారు. అప్పటికే పోలీసులు కలెక్టరేట్‌ ‌ప్రధాన ద్వారానికి తలుపులకు తాళాలు వేసి అడ్డుకున్నారు. కలెక్టరేట్‌ ‌గేటు ఎక్కి లోపలికి ప్రవేశించేందుకు నిరసనకారులు ప్రయత్నించారు. ఆందోళనకారుల వద్దకే అధికారులను పోలీసులు పిలిపించారు. జిల్లా స్థాయిలో పరిష్కరించే వాటిని కమిటీ వేసి పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కెవిపిఎస్‌ ‌రాష్ర్ట అధ్యక్షుడు ఓ.నల్లప్ప మాట్లాడుతూ... జిల్లాలో దళితులు శ్మశాన వాటికలు, మౌలిక సదుపాయాలు, ఇళ్లు, సాగు భూమి కోసం పోరాటాలు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కర్నూలులో అంబేద్కర్ భవన్ నుండి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. కలెక్టరేట్ గేట్లను తెరుచుకొని లోపలికి వెళ్లి సునయన ఆడిటోరియం వెళ్లే దారిలో బైఠాయించి అక్కడ నిరసన తెలియజేశారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ... దళితవాడల్లో మౌలిక వసతుల కొరత, భూకబ్జాలు, దాడులు, అంటరానితనం వంటి సమస్యలు కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. దళితుల ఓట్లను పొందుతున్నటువంటి పాలకులు వారి సమస్యలను పరిష్కరించడంలో మాత్రం చర్యలు తీసుకోవడం లేదన్నారు. నంద్యాలలో కెవిపిఎస్ రాష్ట్ర నాయకులు సూర్యారావు మాట్లాడుతూ.. ఆక్రమణకు గురైన స్మశాన స్థలాలను రక్షించాలని, దళిత వాడల్లో డ్రైయినేజీ కాల్వలు, సిసి రోడ్లు ఏర్పాటు చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో దళితులకు మూడు ఎకరాల భూమి కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

​ మచిలీపట్నం కలెక్టరేట్‌ వద్ద వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ...స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు గడిచిన నేటికీ దళిత వాడల్లో స్మశాన భూములు లేవన్నారు. కనీస సదుపాయాలు కూడా నోచుకోలేదన్నారు. .పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ కలెక్టరేట్‌ వద్ద సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్‌ మాట్లాడుతూ.. ఎస్‌సి కార్పొరేషన్ ద్వారా భూమి కొనుగోలు పథకాన్ని పునరుద్ధరించి అర్హులకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని, సుదీర్ఘ కాలంగా న్యాయం కోసం పోరాడుతున్న దళిత క్రైస్తవులకు చట్టబద్ధమైన ఎస్‌సి హోదా కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు.

నెల్లూరులో వి ఆర్ క్రీడా మైదానం నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ.. వివక్ష లేని సమాజం కోసం, దళితవాడల లోని సమస్యల పరిష్కారం కోసం జిల్లా వ్యాప్తంగా అధ్యయన యాత్రలు నిర్వహించడం జరిగిందన్నారు. శ్రీకాకుళంలో ఆర్అండ్‌బి అతిథిగృహం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. ఎపి రైతుసంఘం రాష్ట్ర నాయకులు మర్రాపు సూర్యనారాయణ పాల్గొన్నారు. కడప, అన్నమయ్య జిల్లాల కలెక్టరేట్ల వద్ద మహాధర్నా నిర్వహించారు. కడపలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి, అన్నమయ్య జిల్లాలో గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్రావు పాల్గొన్నారు.

విజయనగరంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ...మన దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మనుధర్మ సిద్ధాంతం అమలు చేస్తూ కులవివక్షత మరింత పెంచుతోందని వివరించారు. పార్వతీపురంలోజరిగిన ధర్నాలో ఎపి ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆరిక అశోక్ పాల్గొన్నారు. జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.

అనకాపల్లిలో శవపేటికతో కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, కలెక్టర్ కార్యాలయం గేట్ వద్ద నిరసన తెలిపారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు.అనంతరం ఒక వ్యక్తి మరణిస్తే అతని భౌతిక కాయానికి కర్మ క్రియలు నిర్వహించడానికి పడే పాట్లను కళ్ళకు కట్టినట్టుగా వివరించారు. చిత్తూరులో ఆందోళన చేపట్టారు.

కాకినాడలో జరిగిన ధర్నాలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎవి.నాగేశ్వరరావు మాట్లాడుతూ… ఉపాధి కల్పనలో పట్టణాల్లో దళిత యువత కుల వివక్షను ఎదుర్కొంటున్నట్లు సర్వేలో తెలిసిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం లో సిమెంట్ రోడ్లు దళిత పేటల్లో కాకుండా పెత్తందారుల వీధుల్లోనే వేస్తున్నారన్నారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. హరిబాబు మాట్లాడుతూ.. దళితులు మరణించిన తరువాత అంత్యక్రియలకు కూడా స్మశానాలు ఉండడం లేదన్నారు. అమలాపురంలో నిర్వహించిన ధర్నాలో పిడిఎఫ్ మాజీ ఎంఎల్.సి ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. దళితుల సమస్యల పరిష్కారం కోసం కుల మతాలకు అతీతంగా అభ్యుదయ వాదులు, ప్రజాస్వామ్యవాదులు ఐక్యంగా పోరాడాలని కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ.. కోనసీమ జిల్లాలో భూస్వాముల చేతుల్లో ఉన్న సుమారు పది లక్షల కొబ్బరి చెట్లను ప్రతి దళిత కుటుంబానికి 15 చెట్లు చొప్పున పంచాలని డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో నిర్వహించిన ధర్నాలో కెవిపిఎస్‌ ‌రాష్ర్ట నాయకులు యువి.రామరాజు మాట్లాడుతూ.. దళిత కాలనీల్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.రామకృష్ణ మాట్లాడుతూ.. దళితుల స్మశాన వాటికల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. దళితుల భూములకు రక్షణ కల్పించాలని కోరారు.

భీమవరంలో కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.బలరాం మాట్లాడుతూ..స్వాతంత్రం వచ్చి 80 ఏళ్లు పూర్తవుతున్నా దళితుల స్థితిగతుల్లో ఎటువంటి మార్పూ రాలేదని, ప్రభుత్వాలు మారుతున్నా దళితుల పట్ల ఎందుకు అంత వివక్ష చూపుతున్నారన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో స్మశాన వాటిక సమస్య ప్రతిబింబించేలా శవపేటికలతో వినూత్నరీతిలో నిరసన తెలిపారు. ‌సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.రాజారామ్మోహన్ రాయ్, మాజీ ఎంఎల్‌ఎ దిగుపాటి రాజగోపాల్‌ పాల్గొన్నారు. స్మశాన వాటిక సమస్య ప్రతిబింబించేలా ఖాళీ శవ పేటికలతో చేపట్టిన ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు.

పల్నాడు జిల్లా నరసరరావుపేట ధర్నా చౌక్ లో , గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ... వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటల సాగు తగ్గిపోయి వ్యవసాయ కార్మికులకు రెండు నెలలుగా ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. గుంటూరులో వ్యవసాయ కార్మిక సంఘం మాజీ రాష్ర్ట కార్యదర్శి పి.మురళీకృష్ణ మాట్లాడుతూ..రంగారావు కమిటీ సిఫార్సులు అమలు చేస్తే రాష్ర్టంలో ప్రతి కుటుంబానికి రెండెకరాల భూమి ఇవ్వవచ్చన్నారు. ​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్