- కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి
- పలుచోట్ల సామాజిక శంఖారావం వర్క్‌షాప్‌లు
ప్రజాశక్తి - యంత్రాంగం : అధునాతన టెక్నాలజీ అభివృద్ది అవుతున్న సాంకేతిక యుగంలోనూ సమాజంలో అసమానతలు మరింత పెరుగుతున్నాయని, దీనికి మరింత ఆజ్యం పోసేదే కుల వ్యవస్థ అని ప వక్తలు పేర్కొన్నారు. సామాజిక శంఖారావం కార్యక్రమాలు పలు జిల్లాల్లో ఆదివారం జరిగాయి.
ఏలూరులోని అల్లూరు సత్యనారాయణ భవనంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఎ.ఫ్రాన్సిస్ అధ్యక్షతన జరిగిన సామాజిక శంఖారావం జిల్లా వర్క్ షాప్ నకు కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి.బలరాం ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. ఊరికి దూరంగా ఉండే దళితులు స్వాతంత్రం వచ్చి 76 ఏళ్లు నిండినా నేటికీ వివక్షకు గురవుతూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు కనీసం స్మశాన వాటికలు కూడా ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యధిక దళితపేటల్లో డ్రెయినేజీ, సిసి రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు సరిగా లేవన్నారు. సబ్ ప్లాన్ నిధులు మంజూరు చేసి అభివృద్ధి చెయ్యాలనే అంశమే లేకుండా దళితులకు పాలకులు అన్యాయం చేస్తున్నారని వివరించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.రామకృష్ణ, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు టి.రామకృష్ణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్, శ్రామిక మహిళా నాయకురాలు ఎం.నాగమణి, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రవికుమార్ మాట్లాడారు.
విజయవాడ పాయకాపురం 61వ డివిజన్ దేవినేని గాంధీపురంలో జరిగిన శంఖారావం కార్యక్రమంలో సిఐటియు నాయకులు సిహెచ్.బాబూరావు తదితర నేతలు పర్యటించారు. దళిత, గిరిజనులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు పూర్తిస్థాయిలో జరగడంలేదని నేతలకు వారు వివరించారు. టిడ్కో ఇళ్లు, పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలు కాగితాలకే పరిమితమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ ఇళ్ల పట్టాలపై పోరు ఉధృతం చేస్తామన్నారు. కృష్ణాజిల్లా బంటుమిల్లిలో, ములపర్రు దళితవాడల్లో సామాజిక శంఖారావం నిర్వహించారు. గార్లగుంటలో శ్మశానం, తాగునీటి సౌకర్యం, ట్రాన్స్‌ఫార్మర్, రోడ్ల నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరారు. ములపర్రు దళితవాడలో పాఠశాల భవనం, డ్రెయినేజీ సౌకర్యాలు కల్పించడంతో పాటు లో-వోల్టేజ్ సమస్యను పరిష్కరించాలని, నిలిచిపోయిన గృహాల బిల్లులు విడుదల చేసి నిర్మాణాలు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎపి రైతు సంఘం కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు, కోవూరు మండలాల్లో నాయకులు పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఆత్మకూరు రూరల్ మండలం మురగళ్ల గ్రామంలో పర్యటించి కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఆలూరు తిరుపాలు, జిల్లా ఉపాధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య జిల్లా కమిటీ సభ్యులు జి.పెంచలయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు టి.త్రివిక్రమ్ లకు గ్రామస్తులు తమ సమస్యలు విన్నవించుకున్నారు. 80 కుటుంబాల వారం నివసిస్తున్నామని 70 మందికి సెంటు భూమి కూడా లేదని, తమ మీద రాజకీయ ఒత్తిడి ఉందని, చేపల చెరువులోని చేపలు పట్టుకోనివ్వకుండా గత నాలుగు సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్నారని, 20 మందికి ఇళ్ల స్థలాల సమస్య ఉందని తెలిపారు. కోవూరు పట్టణంలోని రాళ్లమెట్ట, నాగలకట్ట ప్రాంతాల్లో పర్యటించిన అధ్యయన ఈ బృందం ఆ ప్రాంత ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకుంది. ప్రధానంగా డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, వీధి దీపాలు వెలగకపోవడం, అధ్వాన పారిశుధ్యంపై స్థానికులు బృందం దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో చేతివృత్తుల రాష్ట్ర నాయకుడు గుంజి దయాకర్, కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గండవరపు బుజ్జయ్య, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు నాయకులు పాల్గొన్నారు.
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో దళితుల సమస్యలపై ప్రజాసంఘాల నాయకులు దళిత పేటల్లో సమస్యలను తెలుసుకున్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలో కౌలురైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు టి.రమేష్ కుమార్ దళిత వాడలోని డంపుయార్డును, ఆత్మకూరు మండలం వడ్ల రామాపురం గ్రామంలో స్మశాన వాటిక సమస్యను నాయకులు పరిశీలించారు. ఆదోనిలో సిఐటియు జిల్లా నాయకులు గౌస్ దేశాయి ఆధ్వర్యాన దళితుల కాలనీలో, ఆర్టిసి కొత్తబస్టాండు సమస్యలను పరిశీలించారు. ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో నాయకులు దళిత పేటలను సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు.








కామెంట్‌లు (0)