లేదంటే వ్యవసాయ మంత్రి కార్యాలయం ముట్టడి
ప్రజాశక్తి - తెనాలి (గుంటూరు జిల్లా) కోల్డ్ స్టోరేజీ అగ్ని ప్రమాద బాధిత పసుపు రైతులకు పరిహారం విషయంలో ప్రభుత్వం న్యాయం చేయకుంటే వారంలోపు వ్యవసాయ మంత్రి కార్యాలయం ముట్టడి లేదా రాయబారం నిర్వహిస్తామని నాయకులు, రైతులు హెచ్చరించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో సంభవించిన అగ్ని ప్రమాదంలో పసుపు పంట నష్టపోయిన రైతులకు పరిహారం విషయంలో ప్రభుత్వ హామీని నెరవేర్చాలని కోరుతూ గురువారం దుగ్గిరాలలో బంద్ చేపట్టారు. పసుపు రైతుల సంఘం, సిపిఎం, సిపిఐ, రైతు సంఘం, కౌలురైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ సందర్భంగా పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకర్ మాట్లాడుతూ... రెండు సంవత్సరాల నాలుగు నెలలుగా న్యాయం కోసం పసుపు రైతులు పోరాడుతూనే ఉన్నారని, దాదాపు 200 సార్లు అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి మొరపెట్టుకున్నారని చెప్పారు. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా కలిశామని చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.6,800 ఉండగా, రూ.పది వేల చొప్పున రైతుకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశామని, రూ.ఏడు వేలు చెల్లించేందుకు మంత్రులు, అధికారులు, కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం సమక్షంలో అంగీకారం కుదిరిందని తెలిపారు. అయితే, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో కొంతమేర ఇన్సూరెన్స్ సొమ్ము మినహా రైతులకు చేకూరిన ప్రయోజనమేమీ లేదన్నారు. పైగా రూ.ఐదు వేలతో సరిపెట్టుకోవాలని అధికారులు చెప్పడం కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యానికి వంత పాడటమేనని విమర్శించారు. పసుపు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.శివసాంబిరెడ్డి మాట్లాడుతూ బాధిత రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. బంద్ సందర్భంగా జరిగిన ర్యాలీలో సిపిఐ, సిపిఎం, వైసిపి, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)