* ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే ఆగస్టు 1న రాష్ట్ర వ్యాప్త నిరసన
* బిజెపి తీరుపై టిడిపి, వైసిపి నోరుపెగలడం లేదు
* సిఎం చంద్రబాబు తీరు ఎపి తలదించుకునేలా ఉంది
* సిజెఐ తీరు న్యాయవ్యవస్థకు కళంకం
* ప్రైవేటు ఎయిర్‌పోర్టుకు ప్రభుత్వ ఖర్చుతో ప్రారంభోత్సవం అధికార దుర్వినియోగం
* జిఓ3, 1/70పై ఆదివాసీ యువత ఆగ్రహం
* ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్ ఏమయ్యారు
విజయవాడ : కేంద్రంలో బిజెపికి కౌంట్ డౌన్ మొదలైందని, యువతలో వచ్చిన తిరుగుబాటుకు సమాధానం చెప్పలేక ఇప్పుడు నీట్‌పై చర్చకు సిద్ధమని మోడీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. ప్రధాని రాష్ట్రానికి వస్తున్న ఆగస్టు 1లోపు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతామని ఆయన హెచ్చరించారు. విజయవాడలోని బాలోత్సవ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు.
పరీక్షల పేపర్ల లీక్‌తో సహనం కోల్పోయిన యువత బిజెపికి వ్యతిరేకంగా ఢిల్లీలో పెద్దఎత్తున నిరసనకు దిగిందని, దీనికి వారి తల్లిదండ్రుల నుండి కూడా మద్దతు వస్తోందని శ్రీనివాసరావు తెలిపారు. ఎప్పుడూ చేయని విధంగా పోలీసులు ఇష్టం వచ్చినట్లు లాఠీఛార్జి చేశారని అన్నారు. రోమ్ నగరం తగలబడిపోతుంటే చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్లు మోడీ తీరు ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై దేశం కోడై కూస్తోందని అన్నారు. మోడీ చెప్పే జెన్‌జడ్ తరమే తిరగబడిందని, దీన్ని ఆపడం ఎవరి తరమూ కాదని అన్నారు. దేశంలో జరుగుతున్న ఆందోళనలపై నిద్ర నటిస్తున్న మోడీని ముల్లుకర్రతో నిద్ర లేపాల్సి వస్తోందని తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేరుకు తగ్గట్లుగా లేరని, తీరు పూర్తి అధర్మేంద్ర ప్రధాన్‌గా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతను పోలీసులు తీవ్రంగా కొడితే దానిపై స్పందించేందుకు ఇష్టపడని సుప్రీం కోరు చీఫ్ జస్టిస్ తీరు దేశ న్యాయవ్యవస్థకు కళంకం తెస్తుందని అన్నారు. ఆయన తీరుతో నేటితరం మనుగడ పశ్నార్థకమవుతుందని అన్నారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్లి మోడీని పొగడం చూస్తుంటే రాష్ట్ర ప్రజలు తలదించుకునేలా ఉందని అన్నారు. విద్యార్థులు, యువత చేస్తున్న ఆందోళనపై కేంద్రాన్ని ముఖ్యమంత్రిగానీ, పవన్‌కల్యాణ్‌గానీ, వైసిపి అధినేత జగన్‌గానీ ప్రశ్నించకపోవడం తీవ్ర అన్యాయమని పేర్కొన్నారు. దేశంలో ఏదో జరుగుతోందని తమకేం పని అన్నట్లు వారు వ్యవహరిస్తున్నారని, రాజకీయపార్టీలు కనీస స్పృహతో వ్యవహరించాలని ఘాటుగా విమర్శించారు. వీరి తీరు మోడీ పల్లకీమోయపడానికి పోటీపడుతున్నట్లు ఉందని, ఇదే పద్ధతిలో వ్యవహరిస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.
జిఎంఆర్ చేతిలో ఉన్న భోగాపురం ఎయిర్‌పోర్టుకు ప్రభుత్వం నిధులు కేటాయించి ప్రారంభోత్సవాలు నిర్వహించడం అన్యాయమని అన్నారు. ఆ నిధులను సంక్షేమ పథకాలకు కేటాయించాలని కోరారు. అలాగే గిరిజన ఉపాధ్యాయులను విధుల నుండి తొలగించారని, వారు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఇప్పటికీ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించలేదని, పిఆర్‌సి వేయలేదని విమర్శించారు. జిఓ 3, 1/70 చట్టం విషయంలో ప్రభుత్వం స్పందన సరిగాలేదని తెలిపారు. జిఓ 3 రద్దయి నాలుగేళ్లవుతున్నా పునరుద్ధరించే చర్యలు తీసుకోవడంలో గత ప్రస్తుత ప్రభుత్వాలు రెండూ విఫలం అయ్యాయని అన్నారు. కోర్టులో సరిగ్గా జోక్యం చేసుకోకుండా కావాలని వదిలేశాయని అన్నారు. అదే తరహాలో ఇప్పుడు 1/70 చట్టం విషయంలో కూడా జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీన్ని రద్దు చేయించడానికి భూస్వాములు, పెత్తందారులు సుప్రీం కోర్టులో కేసు వేశారని, ప్రభుత్వం వారికి వత్తాసు ఇస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం సీనియర్ న్యాయవాదిని నియమించి రాష్ట్ర ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించాలని సూచించారు. నిరంతరం పర్యవేక్షణకు ఉన్నతస్థాయి కమిటీ వేయాలని తెలిపారు. అలా జరగనిపక్షంలో ప్రజలు క్షమించబోరని, సిఎం ప్రజల ముందు బోనులో నిలబడాల్సి వస్తుందని హెచ్చరించారు.

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... విద్యార్థుల ఆందోళనల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని అన్నారు. దీనిపై ఆలస్యంగా స్పందించిన మోడీ పేపర్ లీక్‌పై ఘోరమైన వైఫల్యమని చెప్పారని, మరి దానికి కరణమైన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షల పేపర్లే ఎక్కువసార్లు లీకయ్యాయని పేర్కొన్నారు. పదేపదే జరిగినా పట్టించకోకపోవడం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటమేనని విమర్శించారు. ఢిల్లీలో జరుగుతోంది ప్రభుత్వాల తీరుతో అన్యాయానికి గురైన విద్యార్థు ఘోషని, దాన్ని వినకపోతే ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్రంలో ప్రశ్నిస్తానని ముందుకొచ్చిన పవన్‌కల్యాణ్ దీనిపై కనీసం నోరెత్తడం లేదని అన్నారు. వెంటనే ప్రభుత్వం దీనిపై చర్చించి తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యార్థులపై బనాయించిన కేసులు రద్దు చేయాలని కోరారు.








కామెంట్‌లు (0)