పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీ కూటమికి ఆధిక్యం
ప్రజాశక్తి – ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. తొలుత అధికారులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించగా, వెలువడిన ప్రాథమిక ఫలితాల్లో తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థులు ఆధిక్యాన్ని ప్రదర్శించారు. పలు మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉండటంతో ఆ పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
రాష్ట్రవ్యాప్తంగా ప్రధానంగా చర్చనీయాంశమైన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)లో కూటమి మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 125 ఓట్ల ఆధిక్యం సాధించారు. జీవీఎంసీ పరిధిలో మొత్తం 747 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవగా, కూటమి అభ్యర్థికి 351, వైసీపీ అభ్యర్థికి 226 ఓట్లు వచ్చాయి. మరో 170 ఓట్లు ఇతరులకు లభించాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ వార్డులో మరోసారి ఎర్రజెండా ఎగిరింది. విశాఖ జివిఎంసి 105 వ వార్డు (స్టీల్ ప్లాంట్) కార్పొరేటర్ గా సిపిఎం అభ్యర్థి కృష్ణయ్య విజయం సాధించారు. మంగళవారం నిర్వహించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి 1109 లో .... 508 టిడిపి, 349 వైసిపి, 245 ఇతర పార్టీలకు కాగా ప్రక్రియ జరుగుతున్నదని జివిఎంసి కమిషనర్, అదనపు ఎన్నికల అధికారి కేతన్ గార్గ్ తెలిపారు.105 వ వార్డులో ఎం.కృష్ణయ్య సిపిఎం అభ్యర్థి 107 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు.
ఎన్టిఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీ 13 వ వార్డులో సిపిఎం అభ్యర్థి మేడిపల్లి నాగమణి ఘన విజయాన్ని సాధించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. ఇక్కడ పోలైన మొత్తం 15 పోస్టల్ బ్యాలెట్ ఓట్లూ టీడీపీ ఛైర్మన్ అభ్యర్థి రాజ్‌కుమార్ కు దక్కాయి.
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కూడా కూటమి అభ్యర్థి మెరుగైన ఆధిక్యాన్ని కనబరిచారు. మొత్తం 20 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కూటమి ఛైర్మన్ అభ్యర్థి నల్లా శ్రీధర్‌కు 16 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి విరితా దేవికి మూడు ఓట్లు వచ్చాయి.
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నగర పంచాయతీలోనూ కూటమి అభ్యర్థి గుండుమల శారద 16 ఓట్లు సాధించి ముందంజలో నిలిచారు. మొత్తం 20 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్‌కు రెండు, వైసీపీకి ఒక ఓటు లభించాయి.
నంద్యాల జిల్లా నందికొట్కూరులోనూ కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగారు. ఇక్కడ మొత్తం 82 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కూటమి ఛైర్మన్ అభ్యర్థికి 45, వైసీపీ అభ్యర్థికి 31 ఓట్లు పోలయ్యాయి. నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో ... 23 వ వార్డులో సిపిఎం అభ్యర్థి ఆకుతోట రణధీర్, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుబ్బరాజు పై 534 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం అధికారులు బ్యాలెట్ బాక్సులను తెరిచి సాధారణ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. దీంతో తదుపరి ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.







కామెంట్లు (0)