24 ఏళ్ల అనుబంధానికి ఒక్క ఈమెయిల్‌తో ముగింపు.. మైక్రోసాఫ్ట్ ఉద్యోగినికి ఊహించని షాక్!
లారా విలియమ్స్ ఉదంతం లింక్డ్‌ఇన్‌లో చర్చనీయాంశం
బిజినెస్ : ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగుల తొలగింపుల పరంపర కొనసాగుతోంది. సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా వందలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది. ఈ క్రమంలో ఏకంగా 24 ఏళ్లుగా సంస్థలో పనిచేస్తున్న ఓ సీనియర్ మహిళా ఉద్యోగినిని కూడా ఉద్యోగంలో నుండి తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ఇన్నేళ్ల పాటు సంస్థ అభివృద్ధిలో భాగస్వామిగా ఉన్న ఆమెకు చివరకు ఒక ఈమెయిల్ ద్వారా ఉద్యోగం ముగిసినట్లు సమాచారం అందడం గమనార్హం.
మైక్రోసాఫ్ట్‌లో సాఫ్ట్‌వేర్ డాక్యుమెంటేషన్ విభాగంలో పనిచేస్తున్న లారా విలియమ్స్ ఈ చేదు అనుభవాన్ని లింక్డ్‌ఇన్ వేదికగా పంచుకున్నారు. తన 24 ఏళ్ల సుదీర్ఘ ఉద్యోగ ప్రయాణానికి అనూహ్యంగా తెరపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఐటీ బృందాలు తమ డాక్యుమెంటేషన్‌ను రూపొందించుకోవడానికి కృత్రిమ మేధ (ఎఐ) సాధనాలను ఎలా వినియోగించుకోవాలో వివరిస్తూ ఆమె 90 నిమిషాల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సమయంలోనే తొలగింపు సమాచారం అందింది.
శిక్షణా కార్యక్రమం కొనసాగుతుండగా 'హై ప్రయారిటీ బిజినెస్ అప్‌డేట్' పేరుతో మైక్రోసాఫ్ట్ టీమ్స్ సమావేశానికి ఆహ్వానం అందిందని లారా తెలిపారు. అనంతరం ఆమె ఉద్యోగానికి సంస్థ ముగింపు పలుకుతున్నట్లు తెలిసిందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 22 న సంస్థ చేపట్టిన ఉద్యోగుల తొలగింపుల్లో ఆమె కూడా షాకయ్యారు. నవంబర్ 22 ఆమెకు కంపెనీలో చివరి పని దినంగా నిర్ణయించారు. ఈ పరిణామంపై ఆమె స్పందిస్తూ .. సాఫ్ట్‌వేర్ డాక్యుమెంటేషన్ రంగంలో తన 24 ఏళ్ల కెరీర్‌కు ఇది ఒక బలమైన ముగింపులా అనిపిస్తోందని పేర్కొన్నారు. ఇన్నేళ్ల ప్రయాణంలో తనకు సహకరించిన సహోద్యోగులు, ఉన్నతాధికారులు, ముఖ్యంగా తన భర్తకు కృతజ్ఞతలు తెలిపారు.
లింక్డ్‌ఇన్‌లో వెల్లువెత్తిన మద్దతు ..
లారా తన అనుభవాన్ని వెల్లడించడంతో లింక్డ్‌ఇన్ వినియోగదారులు పెద్ద సంఖ్యలో స్పందించారు. 24 ఏళ్లపాటు సంపాదించిన అనుభవం, నైపుణ్యం ఎంతో విలువైనవని, ఒక సంస్థ నుంచి ఉద్యోగం కోల్పోయినంత మాత్రాన ఆమె ప్రతిభకు విలువ తగ్గదు అని ధైర్యం చెప్పారు. మైక్రోసాఫ్ట్‌తో ప్రయాణం ముగిసినా జీవితంలో మరిన్ని అవకాశాలు ఉన్నాయని, గతంలో కంటే మెరుగైన స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. పెద్ద సంస్థలు ఉద్యోగుల తొలగింపుల విషయంలో మానవీయ కోణాన్ని విస్మరిస్తున్నాయని కొందరు వ్యాఖ్యానించారు. సంస్థకు దశాబ్దాలపాటు సేవలందించిన ఉద్యోగుల పట్ల ఇలాంటి నిర్ణయాలు బాధాకరమని అభిప్రాయపడ్డారు.
పునర్వ్యవస్థీకరణ పేరుతో ఉద్యోగుల కోతలు ..
మైక్రోసాఫ్ట్ గత కొన్ని నెలలుగా సంస్థాగత మార్పులు, వ్యయ నియంత్రణ, పునర్వ్యవస్థీకరణ పేరుతో ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తోంది. జూలైలో ఎక్స్‌బాక్స్‌తో పాటు ఇతర విభాగాల్లో సుమారు 4,800 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇది సంస్థ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు రెండు శాతానికి సమానం. అనంతరం సెప్టెంబర్‌లోనూ మరో విడత ఉద్యోగులపై వేటు వేసింది.
సాంకేతిక రంగంలో ఎఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సంస్థలు తమ పని విధానాలను మార్చుకుంటున్నాయి. అయితే ఈ మార్పుల ప్రభావం దీర్ఘకాలంగా సంస్థలకు సేవలందించిన ఉద్యోగులపైనా పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. లారా విలియమ్స్ ఉదంతం ఉద్యోగ భద్రత, సంస్థల బాధ్యత, ఉద్యోగుల పట్ల మానవీయ దృక్పథం వంటి అంశాలపై మరోసారి చర్చకు తెరతీసింది.







కామెంట్‌లు (0)