కత్తిపూడి (కాకినాడ) : కత్తిపూడిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భవానీ యాత్రికులను స్కార్పియో వాహనం ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలోని కత్తిపూడి జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.
విజయనగరం జిల్లా డెంకాడ మండలానికి చెందిన దాదాపు 40 మంది భవానీ మాలధారులు ప్రత్యేకంగా ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును మాట్లాడుకుని విజయవాడ వైపు ప్రయాణమయ్యారు. కనకదుర్గమ్మను దర్శనం చేసుకునేందుకు వెళ్తున్నారు. అయితే వీరి బస్సు కాకినాడ జిల్లా కత్తిపూడి సమీపానికి చేరుకోగానే వాహనంలో సడన్‌గా సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ వాహనాన్ని జాతీయ రహదారి పక్కగా సురక్షితంగా నిలిపివేశారు. బస్సు రిపేర్ అవుతుండటంతో, సుదీర్ఘ ప్రయాణంతో అలసిపోయిన కొందరు యాత్రికులు కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు బస్సు దిగారు. ఇందులో భాగంగా కొందరు టీ తాగేందుకు రహదారి దాటి ఎదురుగా ఉన్న షాపు వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. సరిగ్గా అదే సమయంలో అత్యంత వేగంగా ఒక స్కార్పియో వాహనం రోడ్డు దాటుతున్న యాత్రికులను బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతకు భవానీలు గాల్లోకి లేచి దూరంగా పడిపోయారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ముగ్గురు ఘటనా స్థలంలోనే రక్తమడుగులో ప్రాణాలు వదిలారు. తీవ్రంగా గాయపడిన మరొకరిని స్థానికులు, పోలీసులు వెంటనే గమనించి సమీపంలోని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో పరిస్థితి విషమించి ఆయన కూడా మృతి చెందారు. మరో ఇద్దరిక తీవ్రగాయాలవ్వగా వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఈ దుర్ఘటనలో మరణించినవారిని విజయనగరం జిల్లా డెంకాడకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. చిరికిడి ఎర్రయ్య (38), లింగాల సీతారాం (45), బోనెల సత్తిబాబు (40), తాటిపూడి శివప్రసాద్ (40)లుగా గుర్తించారు. ఒకే ప్రాంతానికి చెందిన నలుగురు దుర్మరణం పాలవడంతో డెంకాడ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘోర ప్రమాదంపై మంత్రి లోకేష్ స్పందించారు. ' కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన భవానీ భక్తులు మృతి చెందడం చాలా బాధాకరం. మృతులకు నివాళులు అర్పిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది.' అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.







కామెంట్‌లు (0)