శ్రీకాకుళం : దసరా పండుగ సెలవుల సందర్భంగా ... విహారయాత్రకు వెళ్లిన శ్రీకాకుళంలోని ‘నెక్ట్స్ ఎరా’ ప్రైవేటు శిక్షణ సంస్థకు చెందిన ముగ్గురు యువతులతోపాటు, వారిని కాపాడేందుకు ప్రాణాలకు తెగించిన ఓ యువకుడు సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన శ్రీకాకుళం రూరల్ మండలం పీజీపేట సముద్ర తీరంలో మంగళవారం జరిగింది. శ్రీకాకుళం కొత్తరోడ్డు వద్ద ఉన్న నెక్ట్స్ ఎరా శిక్షణ సంస్థ నుంచి దాదాపు 25 మంది సభ్యుల బృందం దసరా పండుగ సందర్భంగా ... పీజీపేట తీరానికి విహారయాత్రకు వెళ్లింది. తీరంలో ఆనందంగా గడుపుతూ, సెల్ఫీలు దిగుతూ కొంతమంది లోతైన నీటి ప్రాంతంలోకి వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అలల ఉధృతికి ముగ్గురు యువతులు సముద్రంలోకి కొట్టుకుపోయారు. యువతులు మునిగిపోతుండటాన్ని గమనించిన పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టానికి చెందిన బిడ్డిక విక్రమ్ (25) వెంటనే సముద్రంలోకి దిగి వారిని రక్షించేందుకు ప్రయత్నించాడు. విక్రమ్ ఎంతో శ్రమించి మర్రి మహి, గొల్లపల్లి పావనిలను ఒడ్డుకు తీసుకువచ్చినప్పటికీ, అప్పటికే వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. అనంతరం సముద్రంలో కొట్టుకుపోతున్న కొండల మాధవిని కాపాడేందుకు విక్రమ్ మళ్లీ నీటిలోకి వెళ్లి అలల తాకిడికి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం నాటికి విక్రమ్, మాధవి మృతదేహాలు సముద్ర తీరానికి కొట్టుకొచ్చాయి. మృతులను పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కొండమామిడిపల్లికి చెందిన మర్రి మహి (18), విజయనగరం జిల్లా రామభద్రపురానికి చెందిన గొల్లపల్లి పావని (19), గజపతినగరం మండలం కెంగువ గ్రామానికి చెందిన కొండల మాధవి (19), వీరఘట్టానికి చెందిన బిడ్డిక విక్రమ్ (25) గా గుర్తించారు. ఈ ఘటనపై శ్రీకాకుళం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
సెల్ఫీ సరదా - సముద్రంలో గల్లంతు - నలుగురు మృతి
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 22, 2026, 10:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)