శాన్‌జువాన్ : 75 వ మిస్ యూనివర్స్ పోటీల్లో ప్యూర్టోరికోకు చెందిన జెన్నిఫర్ బారెటో విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. గత ఏడాది విజేతగా నిలిచిన మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్.. జెన్నిఫర్‌కు కిరీటాన్ని అలంకరించారు. ఫైనల్ రౌండ్‌లో నాయకత్వంపై అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది.
ప్యూర్టోరికో రాజధాని శాన్‌జువాన్‌లో జరిగిన ఈ పోటీల్లో 116 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొన్నారు. డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన మెలిస్సా నునెజ్ మొదటి రన్నరప్‌గా, వెనిజులాకు చెందిన క్లారా వేగాస్ రెండో రన్నరప్‌గా నిలిచారు. భారత్ తరఫున పోటీపడిన కేరళకు చెందిన 19 ఏళ్ల కాజియా లిజ్ మెజో టాప్-30లో చోటు దక్కించుకున్నారు. అయితే, టాప్-12 కు చేరకుండానే ఆమె పోటీ నుంచి నిష్క్రమించారు.

నాయకత్వంపై ప్రశ్న.. జెన్నిఫర్ సమాధానమే ప్రత్యేకం !
ఫైనల్ రౌండ్‌లో ఐదుగురు పోటీదారులనూ న్యాయనిర్ణేతలు ఒకే ప్రశ్న అడిగారు. ‘ప్రస్తుతం ప్రపంచానికి నాయకుల నుంచి ఏం కావాలి?’ అన్న ప్రశ్నకు జెన్నిఫర్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.
ప్రపంచానికి వృత్తిపరమైన నైపుణ్యంతోపాటు సహానుభూతి కలిగిన నాయకులు అవసరమని ఆమె పేర్కొన్నారు. ఇతరులను విమర్శించే బదులు వారి పరిస్థితులను అర్థం చేసుకోవాలని, తమ విలువలకు కట్టుబడి ఆదర్శంగా నిలవాలని చెప్పారు. ఆమె సమాధానం న్యాయనిర్ణేతలను విశేషంగా ఆకట్టుకోవడంతో విశ్వసుందరి కిరీటం దక్కించుకున్నారు.
75 ఏళ్ల ప్రస్థానానికి గుర్తుగా ప్రత్యేక కిరీటం
మిస్ యూనివర్స్ పోటీలు 1952లో ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా కిరీటాన్ని రూపొందించారు. ‘ది రేడియన్స్ ఆఫ్ యాన్ ఎటర్నల్ లెగసీ’ పేరుతో రూపొందించిన ఈ కిరీటంలో 3,150 వజ్రాలను పొదిగారు.
ప్యూర్టోరికోకు ఆరోసారి విశ్వసుందరి కిరీటం
జెన్నిఫర్ విజయంతో ప్యూర్టోరికోకు ఆరోసారి మిస్ యూనివర్స్ టైటిల్ దక్కింది. 1970, 1985, 1993, 2001, 2006, 2026 సంవత్సరాల్లో ఆ దేశానికి చెందిన అందాల భామలు విశ్వసుందరి కిరీటాలను సొంతం చేసుకున్నారు.







కామెంట్‌లు (0)