న్యూఢిల్లీ : 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో సామాజిక కార్యకర్తలు ఉమర్ ఖలీద్, షార్జిల్ ఇమామ్ బెయిల్ పిటిషన్‌లపై ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు బుదవారం నోటీసులిచ్చింది. ఢిల్లీ పోలీసుల వాదనలు విన్న తర్వాత వారి పిటిషన్‌లను పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ప్రాసిక్యూషన్ రక్షిత సాక్షులను విచారించడంలో విఫలమైందని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన తమ పిటిషన్‌ల్లో వారు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు విధించిన ఏడాది గడువు ముగింపు దశకు చేరుకుందని తెలిపారు. 2020 సెప్టెంబర్ 25న చార్జిషీట్ దాఖలైందని, అందులో 18మంది నిందితులు విచారణను ఎదుర్కొంటున్నారని, ప్రాసిక్యూషన్ 47మంది రక్షిత సాక్షులతో సహా 900మందికి పైగా సాక్షుల పేర్లను నమోదు చేసినట్లు ఇమామ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తాను ఆరు సంవత్సరాల తొమ్మిది నెలలు విచారణ ఖైదీగా గడిపినప్పటికీ, ప్రాసిక్యూషన్ ఒక్క సాక్షిని కూడా విచారించలేదని ఇమామ్ వాదించారు. రక్షిత సాక్షులను విచారించడంలో విఫలమైన విషయాన్ని ఉమర్ ఖలీద్ కూడా ప్రస్తావించారు. ఏడాది కాలపు నిషేధం గడువు ముగియడమంటే తనను జైలులో కొనసాగించడమని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.
2020 ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన అల్లర్ల వెనుక ఉన్న "భారీ కుట్ర"కు పాల్పడ్డారంటూ ఉమర్ ఖలీద్, షార్జిల్ ఇమామ్‌లకు బెయిల్ మంజూరు చేయడానికి ఢిల్లీ హైకోర్టు సెప్టెంబర్ 30న తిరస్కరించింది. తాము "న్యాయపరమైన క్రమశిక్షణ"కు కట్టుబడి ఉన్నామని పేర్కొంటూ, రక్షిత సాక్షుల విచారణ తర్వాత గానీ లేదా ఒక సంవత్సరం గడిచిన తర్వాత గానీ, ఏది ముందైతే అప్పుడు గానీ బెయిల్ కోరాలని ఇద్దరు నిందితులను ఆదేశిస్తూ, సుప్రీంకోర్టు జనవరి 5న ఇచ్చిన ఉత్తర్వును తాము సవరించలేమని హైకోర్టు తెలిపింది. తమ అరెస్టు తర్వాత మూడవసారిగా, తమ బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తూ ట్రయల్ కోర్టు జులై 4న ఇచ్చిన తీర్పును ఉమర్‌ఖలీద్, షార్జిల్ ఇమామ్‌లు సవాలు చేశారు. సుప్రీంకోర్టు జనవరి 5 ఉత్తర్వును "పాటించడం తప్ప తమకు మరో మార్గం లేదని", దీంతో పిటిషన్‌ను స్వీకరించలేమని లేదా ఎలాంటి ఉపశమనం కల్పించలేమని పేర్కొంటూ ట్రయల్ కోర్టు వారి బెయిల్ దరఖాస్తులను తిరస్కరించింది.
ఫిబ్రవరి 2020లో ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లకు సూత్రధారులలో వీరు కూడా ఉన్నారనే ఆరోపణలతో, ఉమర్ ఖలీద్, ఇమామ్‌లపై యుఎపిఎ (చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం) కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో షార్జిల్ ఇమామ్‌ను 2020 ఆగస్టు 25న, ఉమర్ ఖలీద్‌ను 2020 సెప్టెంబర్ 13న ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.







కామెంట్‌లు (0)