బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆగస్టు 17 నుంచి భోగాపురం నుంచే విమాన సర్వీసులు : కేంద్రం

7 గంటల క్రితం

Flight services from Bhogapuram to start from August 17: Centre
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 04:26 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

అమరావతి : విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆగస్టు 17 అర్ధరాత్రి 12:01 గంటల నుంచి షెడ్యూల్‌ కమర్షియల్‌ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.ఈ నేపథ్యంలో ప్రస్తుతం కార్యకలాపాలు సాగిస్తున్న విశాఖపట్నం విమానాశ్రయం (ఐఎన్‌ఎస్‌ డేగ) సివిల్‌ ఎన్‌క్లేవ్‌ నుంచి షెడ్యూల్‌ వాణిజ్య విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం .... విశాఖపట్నం విమానాశ్రయం సివిల్‌ ఎన్‌క్లేవ్‌ నుంచి షెడ్యూల్‌ కమర్షియల్‌ విమానాల కార్యకలాపాలు 30 సంవత్సరాల పాటు నిలిపివేయబడతాయి. అయితే, జాతీయ అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది.


నాన్‌షెడ్యూల్డ్‌ వాణిజ్య విమాన సేవలకు కూడా అనుమతి ....

అదేవిధంగా భారతీయ వాయుసేన, ఇతర సాయుధ దళాలు, పోలీసు శాఖకు చెందిన విమానాలు, ప్రభుత్వ అతిథుల రాకపోకల కోసం వినియోగించే ప్రత్యేక విమానాలు, లీజ్‌ విమానాలు, వీఐపీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు విశాఖపట్నం విమానాశ్రయం నుంచి యథావిధిగా కార్యకలాపాలు కొనసాగించనున్నాయి. అలాగే నాన్‌షెడ్యూల్డ్‌ వాణిజ్య విమాన సేవలకు కూడా అనుమతి కొనసాగుతుందని కేంద్రం తెలిపింది. ఇప్పటి వరకు విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉపయోగిస్తున్న వీటీజెడ్‌ అంతర్జాతీయ ట్రావెల్‌ కోడ్‌ను ఆగస్టు 17 అర్ధరాత్రి 12:01 గంటల నుంచి భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బదిలీ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.


అల్లూరి సీతారామరాజు పేరుతో అధికారిక నామకరణం ....

జీఎంఆర్‌ సంస్థ పబ్లిక్‌-ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో నిర్మించిన భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా అధికారికంగా నామకరణం చేస్తూ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంగళవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ విమానాశ్రయానికి స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని 2024 సెప్టెంబర్‌ 18న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అధికారికంగా ఆమోదం తెలుపుతూ గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్