అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అమరావతిలో ఉద్రిక్తత నెలకొంది. వైసిపి నాయకులు శనివారం అమరావతి ప్రాంతంలో పర్యటించాలని నిర్ణయించడంతో అక్కడ ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైసిపి నేతల పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ .... రాజధాని ప్రాంత రైతులు, మహిళలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. వైసిపి ప్రతినిధుల పర్యటనకు నిరసనగా ఉదయం నుంచే అమరావతి రైతులు ఉండవల్లి సెంటర్‌కు చేరుకుని భారీ ధర్నాకు దిగారు. రహదారిపై బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. వైసిపి నేతల పర్యటనను అడ్డుకుంటామంటూ రైతులు స్పష్టం చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. ధర్నాలో పాల్గొన్న అమరావతి జేఏసీ నాయకులు, రైతులు వైసిపి కి వ్యతిరేకంగా గట్టిగా నినాదాలు చేశారు. “వైసిపి నేతలు గో బ్యాక్” అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసి, మూడు రాజధానుల పేరుతో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన నేతలకు ఇక్కడ అడుగుపెట్టే హక్కు లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక ఏకశిలా రాజధానిగా ‘అమరావతి’ని వైసిపి నేతలు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నట్లు ప్రకటించిన తర్వాతే ఇక్కడ పర్యటించాలని రైతులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
అమరావతిలో ఉద్రిక్తత
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 27, 2026, 12:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)