mh ad
శనివారం, 27 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘విజన్‌ ఇండియా’ ఉద్యమాన్ని ప్రారంభించనున్న అఖిలేష్‌ యాదవ్‌

2 గంటల క్రితం

Akhilesh Yadav
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 12:40 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

లక్నో : ‌దేశంలో పదేపదే జరుగుతున్న పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా, విద్యార్థులకు మద్దతుగా, దేశాన్ని సానుకూల, వాస్తవిక ప్రగతిశీల భవిష్యత్తువైపు నడిపించేందుకు త్వరలో 'విజన్ ఇండియా' పేరుతో ఒక ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ శనివారం ప్రకటించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌‌లో పోస్టు చేశారు.

కాగా, ‘విజన్‌ ఇండియా’ ఉద్యమం దేశాన్ని ‘నియో ఇండియా’గా మారుస్తుంది. ఇది ఎటువంటి వివక్ష లేకుండా దేశం, ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తుంది. నేడు, భారత్ అడుగడుగునా ప్రజలు కష్టాలను, పోరాటాలను ఎదుర్కోవాల్సిన దేశంగా మారింది. ఈ సమస్యలను పరిష్కరించడానికి ‘విజన్‌ ఇండియా’ మార్గాన్ని ఎంచుకున్నాము. ఇది సానుకూల, ఆచరణాత్మక, ప్రగతిశీల సృజనాత్మక దృక్పథంతో, ఎటువంటి పక్షపాతం లేని వివక్షలేని దేశంగా.. ప్రజల అభివృద్ధి కోసం భారతదేశాన్ని 'నియో ఇండియా' (Neo India)గా మార్చడానికి 'విజన్ ఇండియా' కృషి చేస్తోంది అని అఖిలేష్‌ ‌యాదవ్‌ ‌సామాజిక మాధ్యమం ఎక్స్‌‌లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా అఖిలేష్‌ ‌యాదవ్‌ ‌కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై మండిపడ్డారు.

‘ప్రస్తుత మోడీ ప్రభుత్వంలో మితిమీరిన అవినీతి వల్ల విద్య, పరీక్ష వ్యవస్థ కుప్పకూలింది. పేపర్‌ ‌లీక్స్‌, పరీక్షల రద్దు, ఖాళీ పోస్టులను భర్తీ చేయడంలో వైఫల్యం, మూల్యాంకన-రిజర్వేషన్ విధానాల అవకతవకలు యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేసి, నిరుద్యోగాన్ని విపరీతంగా పెంచాయి. ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారం పడింది. ప్రాథమిక పాఠశాలలు మూతపడుతున్నాయి. ఒక ప్రతికూల భావజాలం పీజీ స్థాయి వరకు విద్యపై వేగంగా ఆధిపత్యం చెలాయించాలని కోరుకుంటోంది. ఈ దుర్భర పరిస్థితుల్లో పైపైన చేసే సంస్కరణలు పనికిరావు. ఇప్పుడు సమూల మార్పును తీసుకురావాలి’ అని అఖిలేష్ యాదవ్ పోస్టులో పేర్కొన్నారు. విజన్‌ ఇండియా ఉద్యమానికి సంబంధించి జూన్‌ 29న మొదటి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో విద్యా-పరీక్ష వ్యవస్థ ఎందుకు కూలిపోయిందనే అంశంపై చర్చలు జరిపి.. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమానికి ముందుకు తీసుకెళ్లెందుకు గల చర్యలు చేపట్టనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్