బీజింగ్ : పెంటగాన్ బ్లాక్ లిస్ట్ కి ప్రతిచర్యగా పది అమెరికా సంస్థలపై చైనా ఆంక్షలు విధించింది. రక్షణ, అరుదైన ఖనిజాల సంస్థలు నిషేధం విధించిన వాటిలో ఉన్నాయి. గత నెల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాలో పర్యటించి, అధ్యక్షుడు జిన్ పింగ్ తో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ చైనా సైన్యానికి సహకరిస్తున్నాయని ఆరోపిస్తూ 80 సంస్థలు, వాటి అనుబంధ సంస్థలతో కూడిన కొత్త బ్లాక్ లిస్ట్ ను వాషింగ్టన్ ఈ నెలలో విడుదల చేసింది. టెక్ సంస్థలైన అలీబాబా, బైడూలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ బివైడిని కూడా బ్లాక్ లిస్ట్ లో చేర్చింది. ఈ ప్రకటనపై ప్రతీకార చర్యలు తీసుకుంటామని చైనా హెచ్చరించింది.
అమెరికా చైనీస్ మిలటరీ ఎంటర్ ప్రైజ్ లిస్ట్ అని పిలిచే జాబితాలో చేర్చిన చర్యకు ప్రతిస్పందనగా చైనా ఈ కొత్త ఎగుమతి ఆంక్షలను తీసుకువచ్చిందని వాణిజ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ చర్య జాతీయ భద్రతను కాపాడటానికి ఉద్దేశించిందని పేర్కొంది. ఈ పది సంస్థల జాబితాలో అమెరికా సైన్యంతో ఒప్పందాలు కలిగిన ఏవియోక్స్, ఓష్కోప్ డిఫెన్స్ లు ఉన్నాయి. అరుదైన ఖనిజాల ఉత్పత్తిదారులైన ఎంపి మెటీరియల్స్, యుఎస్ రేర్ ఎర్త్ కూడా ఉన్నాయి. అలాగే లాక్‌హీడ్ మార్టిన్, రేథియాన్ మరియు బోయింగ్ రక్షణ విభాగంతో సహా 46 అమెరికన్ సంస్థలు తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయకుండా చైనా ఆర్థిక శాఖ ఒకేసారి నిషేధాన్ని ప్రకటించింది. జాబితాలో ఉన్న సంస్థలకు ఎగుమతిదారులు ద్వంద్వ ప్రయోజన వస్తువులను అందించడంపై నిషేధం విధిస్తున్నట్లు వాణిజ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఎగుమతి కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని పేర్కొంది. ఏదేశంలో లేదా ఏప్రాంతంలోనైనా చైనాలో తయారైన ద్వంద్వ ప్రయోజన వస్తువులను సదరు సంస్థలకు బదిలీ చేసే లేదా అందించే సంస్థలు, వ్యక్తులకు ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపింది. అయితే చైనాలో కార్యకలాపాలు సాగిస్తున్న అమెరికన్ పెట్టుబడులు కలిగిన కంపెనీలకు ఈ నిషేధం నుండి మినహాయింపు ఉంటుందని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆంక్షలు సోమవారం నుండి అమల్లోకి వస్తాయని వెల్లడించింది.









కామెంట్‌లు (0)