బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసొమ్మొకరిది.. సోకొకరిది

1 గంట క్రితం

కథ1.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 03:04 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ఒకరోజు సాయంత్రం లచ్చవ్వ, రామవ్వ ఇంటి అరుగు మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. పక్కనే జున్నుబాబు ఆడుకుంటున్నాడు. ఇంతలో రామవ్వ ఎదురుగా వస్తున్న ఒక వ్యక్తిని చూసి, ‘వీడి పని బాగుంది! జల్సాగా తిరుగుతున్నాడు’ అంది. ‘కష్టపడి సంపాదించేది ఒకరు... ఖర్చు చేసేది మరొకరు. సొమ్మొకరిది... సోకొకరిది!’ అంది లచ్చవ్వ. అక్కడే ఆడుకుంటున్న జున్నుబాబుకు వెంటనే ఓ సందేహం వచ్చింది. ‘అవ్వా! సొమ్మొకరిది... సోకొకరిది అంటే ఏమిటి?’ అని అడిగాడు. ‘ఒకరు కష్టపడి సంపాదించిన సొమ్మును మరొకరు ఖర్చు చేస్తూ జల్సాగా తిరిగితే అలా అంటారు. ఇది ఒక సామెత’ అని చెప్పింది లచ్చవ్వ. జున్నుబాబు కాసేపు ఆలోచించాడు. ‘అవ్వా! మనం కష్టపడి సంపాదించిన డబ్బుతో ఆహారం కొనుక్కుంటాం. అమ్మ వండి పెడుతుంది. మనం తింటాం. ఆ ఆహారం మనకు శక్తిని ఇస్తుంది కదా!’ అన్నాడు. ‘అవును రా!’ అంది లచ్చవ్వ.

‘కానీ... మనం తిన్న ఆహారం నుంచి మన శరీరానికి అందాల్సిన పోషకాలు మనకు కాకుండా ఇంకెవరికైనా అందితే?’ అని ప్రశ్నార్థకంగా ముఖం పెట్టాడు. ‘ఇంకెవరు తీసుకుంటారు?’ అని ఆశ్చర్యంగా అడిగింది లచ్చవ్వ. ‘నులిపురుగులు!’ అన్నాడు జున్నుబాబు. లచ్చవ్వ ఆశ్చర్యంగా చూసింది. ‘ఇవన్నీ నీకెలా తెలుసురా?’ ‘డీ-వార్మింగ్ డే నాడు మా సార్ చెప్పారు అవ్వా! మన పేగుల్లో నులిపురుగులు ఉంటే, మనం తిన్న ఆహారం నుంచి శరీరానికి అందాల్సిన పోషకాలు సరిగా అందకపోవచ్చట. అందువల్ల బలం తగ్గి నీరసంగా ఉంటామట’ అన్నాడు జున్నుబాబు. ‘అయితే నులిపురుగులు రాకుండా ఏం చేయాలి?’ అని ఏమీ తెలియనట్లు అడిగింది రామవ్వ. ‘చేతులు, గోళ్లు శుభ్రంగా ఉంచుకోవాలి. కూరగాయలు, పండ్లు కడిగి తినాలి. వైద్యుల సలహాతో నులిపురుగుల నివారణ మందు తీసుకోవాలట’ అన్నాడు జున్నుబాబు. ‘అబ్బో మా బాబుకు ఎన్ని విషయాలు తెలిశాయో!’ అంటూ జున్నుబాబును గట్టిగా హత్తుకుంది లచ్చవ్వ. వారిద్దరినీ చూసి పక్కనే ఉన్న రామవ్వ ముసిముసి నవ్వులు నవ్వింది.

- కాశీవిశ్వనాథం పట్రాయుడు,

ఆంగ్ల ఉపాధ్యాయులు,

శృంగవరపుకోట, 94945 24445.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్