నేటి రాత్రికి విశాఖపట్నం-గోపాల్‌పూర్ మధ్య తీరాన్ని దాటే అవకాశం
ఇప్పటికే శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు
భారీ నుంచి అతి భారీ వర్షాలు
వణుకుతున్న ఉత్తరాంధ్ర, పాఠశాలలకు సెలవు
మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని అధికారుల హెచ్చరిక
ప్రజాశక్తి- యంత్రాంగం : పశ్చిమ-మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో మంగళవారం ఉత్తరాంధ్ర జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలాసలో అత్యధికంగా 100.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తీవ్రవాయుగుండం గడిచిన కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదులుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది మంగళవారం సాయంత్రానికి గోపాల్‌పూర్‌కు 150 కిలో మీటర్లు, కళింగపట్నానికి 140 కిలోమీటర్లు, ఒడిశాలోని పూరీకి 210 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది బుధవారం రాత్రికి విశాఖ పట్నం-గోపాల్‌పూర్ మధ్య తీరాలను దాటే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో భారీ వర్షాల కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్లు, హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. బుధ, గురువారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తుపాను అయితే చోట తీరం దాటుతుందని అంచనా వేయవచ్చని, వాయుగుండం అయినందున కచ్చితంగా పలానా చోటే తీరం దాటుతుందని చెప్పలేమని ‘ప్రజాశక్తి’కి విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. బుధవారం తీరానికి అతి దగ్గరగా వస్తున్నందున అతి భారీ వర్షం విశాఖ చుట్టుపక్కలా కురుస్తుందని, తీర ప్రాంతాలన్నింటా భారీ వర్షం నమోదు కాగలదని, ఉత్తరాంధ్రపై ఎక్కువ ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ముందు జాగత్త్ర చర్యగా ఉత్తరాంధ్ర జిల్లాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లోని పాఠశాలకు అధికారులు బుధవారం సెలవు ప్రకటించారు. ఉత్తరాంధ్ర జిల్లాలోని కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం
శ్రీకాకుళం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. వజ్రపుకొత్తూరు మండలం పూండిలో 93.7 మిల్లీమీటర్లు, టెక్కలి మండలం రావివలసలో 92.5 మిల్లీమీటర్లు, సంతబొమ్మాళి మండలంలో 87.61 మిల్లీమీటర్లు, నందిగాంలో 85.7 మిల్లీమీటర్లు, కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో 76.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. శ్రీకాకుళం నగరంలో ఆర్‌టిసి కాంప్లెక్స్ సహా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
విశాఖలో 85.2 మిల్లీమీటర్ల వర్షపాతం
మంగళవారం ఒక్కరోజే విశాఖలో 85.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. స్వతంత్రనగర్, మధురవాడ వంతెన వద్ద భారీగా నీరు చేరింది. అక్కయ్యపాలెం, కెఆర్‌ఎం.కాలనీ, రైల్వే స్టేషన్ ఏరియా, అల్లిపురం, గాజువాక, సైమన్ నగర్ తదితర చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. అనకాపల్లి, అల్లూరి జిల్లాలోనూ వర్షాలు కురిశాయి. నదులు, వాగుల్లో ప్రవాహం పెరిగింది. పోలవరం జిల్లాలోనూ పలుచోట్ల వర్షం కురిసింది.
విజయనగరం జిల్లాలో
50.7 మీల్లీమీటర్ల సగటు వర్షపాతం
విజయనగరం జిల్లాలో 50.7 మీల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. గుర్ల మండలంలో అత్యధికంగా 67.8 మిల్లీమీటర్లు, డెంకాడ మండలంలో 65.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 38.8 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడ్డాయి. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లిలో సముద్ర తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి.
గూగుల్ డేటా సెంటర్ వద్ద కూలిన గోడ
విశాఖలోని ముడసర్లోవ రిజర్వాయర్ ఎదురుగా సింహాచలం దేవస్థానం కొండ అంచున నిర్మాణం చేపడుతున్న గూగుల్ డేటా సెంటర్ వద్ద ఉన్న గోడ మంగళవారం ఒక్కసారిగా కూలిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా కొండ పై నుంచి నీరు కిందకు వస్తోంది. ఆ నీరు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో ఒక్కసారిగా గోడవైపు నీరంతా పోటెత్తింది. బిఆర్‌టిఎస్ రహదారి పొడువునా ఉన్న సుమారు 200 మీటర్ల రక్షణ గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. డేటా సెంటర్ నిర్మాణ పనులు చేపట్టక ముందు గతంలో కొండపై నుంచి వచ్చే వర్షపు నీరు సప్టాల ద్వారా రహదారి కింద నుంచి మడసర్లోవ రిజర్వాయరులోకి వచ్చి చేరేది. డేటా సెంటర్ నిర్మాణం కారణంగా వర్షపు నీరు వచ్చే మార్గాలు మూసుకుపోయాయి. అదే గోడ బిఆర్‌టిఎస్ రహదారివైపు కూలి ఉంటే చాలా ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణ రోజుల్లో రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో చాలా మంది ఈ గోడను ఆనుకునే వాకింగ్ చేస్తూ ఉంటారు. వర్షం కారణంగా మంగళవారం అటు ఎవరూ వెళ్లకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.







కామెంట్‌లు (0)