శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionచిట్టి చేప - ఏటి వీరుడు

8 గంటల క్రితం

చిట్టి చేప - ఏటి వీరుడు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 03:24 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

పచ్చటి అడవి మధ్యలో ఓ సెలయేరు ఉంది. అందులో ఒక చిట్టి చేప ఉండేది. అది రోజూ అమ్మ చేపతో కలిసి ఏటి నీటిలో హాయిగా ఈత నేర్చుకునేది. అమ్మ చేప వెంట అలల పైకి వెళ్తూ, ఎగిరెగిరి దూకేది. ఒక్కోసారి వెల్లకిలా పడిపోతూ, అమ్మని చూసి కిలకిలమని నవ్వుకుంటూ సరదాగా ఆడుకునేది. ఒకరోజు చిట్టి చేప అలా గెంతుతుండగా, ఏటి పక్కన గట్టు పైన ఉన్న ఒక కప్ప చూసింది. దగ్గరకు వచ్చి ‘నాలా నువ్వు నీటిలోన ఎగరలేవు చిట్టి చేప! నేలపైనా గెంతలేవు!’ అంటూఎగతాళిగా నవ్వింది. చిట్టి చేపకు కాస్త దిగులుగా అనిపించింది. తలవంచుకుని కన్నీటితో అమ్మ దగ్గరకు వెళ్ళింది. అప్పుడు అమ్మ చేప చిట్టి చేప తల నిమురుతూ ‘ఎగరనంత మాత్రాన దిగులెందుకే చిట్టి చేప? మనమంతా నీటిలో నివసించే జీవులం. ఏటి ప్రవాహానికి ఎదురీదగల వీరులం! ఈ నీరే మన ప్రాణం, ఈ నీరే మన లోకం!’ అని చెప్పింది. ఆ మాటలు విని చిట్టి చేపకు ఎంతో శక్తి, ఎంతో ధైర్యం వచ్చింది. నీటి మీద ఈదుతూ ఎన్నో విన్యాసాలను చేసింది. రాళ్ల మధ్య మెరుపులా దూకింది, నాచు పొదల మాటున దాగుడుమూతలు ఆడింది, చిన్నిచిన్ని నీటి బుడగలతో ముత్యాల దండ పేర్చినట్లు చేసింది. దారిలో కలిసిన తాబేలుతో కబుర్లు ఎన్నో చెప్పింది. గట్టున తననే చూస్తున్న పూలపూల రెక్కల సీతాకోకచిలుకను రారమ్మని పిలిచి ముచ్చటలెన్నో చెప్పింది. అలా అలా అందర్నీ పలుకరిస్తూ... ఏటికి ఎదురీదుకుంటూ చాలా దూరం వెళ్ళింది. అలా ఆటలాడి ఆటలాడి మళ్లీ తిరిగి అమ్మ దగ్గరికి వచ్చింది. అక్కడే ఉన్న కప్పను చూసి చిట్టి చేప ఎగతాళి చేయకుండా, హాయిగా చిరునవ్వు చిందించింది. చిట్టి చేప ఈతలోని నైపుణ్యం చూసి కప్ప బిక్క మొహం వేసింది. ఒక్కక్షణం నిలువలేక అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. ‘ఎవరి శక్తి వారిదని, ఎవరి ప్రతిభ వారిదని’ మనసులోనే తలచింది.

- శాంతి కృష్ణ,

95022 36670.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్