-వెనుక లైట్లు, రిఫ్లెక్టర్లు లేని భారీ వాహనాలతో ద్విచక్ర వాహనదారులకు ప్రాణహాని
-ప్రభుత్వ శాఖలు, ట్రాఫిక్ పోలీసులు తక్షణమే స్పందించాలి:కే.ఎస్. అఘా మోహిద్దీన్
ప్రజాశక్తి-కలికిరి (అన్నమయ్య) : రాత్రివేళ రహదారులపై జరుగుతున్న ప్రమాదాలకు భారీ వాహనాలకు వెనుకవైపు సరైన లైట్లు, హెచ్చరిక లైట్లు, రిఫ్లెక్టర్లు లేకపోవడం కూడా ప్రధాన కారణమని కలికిరి మండలం, గడి గ్రామానికి చెందిన రిటైర్డ్ మహారాష్ట్ర రవాణా శాఖ అసిస్టెంట్ కమిషనర్ కే.ఎస్. అఘా మోహిద్దీన్ అన్నారు. ట్రక్కులు, ట్రాక్టర్లు, ట్రైలర్లు, లారీలను రాత్రివేళ వెనుక నుంచి వచ్చే ద్విచక్ర వాహనదారులు గుర్తించలేక ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల గ్యారంపల్లి హైవేపై జరిగిన ప్రమాదాన్ని ఆయన ప్రస్తావించారు. ముందుగా వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి వచ్చిన ద్విచక్ర వాహనదారుడు గుర్తించలేక ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. వాహన యజమానులనే బాధ్యులుగా చేయడం సరికాదని, రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసులు, వాహన తనిఖీ అధికారులు కూడా తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. నవంబర్ 2026 నాటికి సరైన లైట్లు, రిఫ్లెక్టర్లు లేని వాహనాలపై ఎన్ని కేసులు నమోదు చేశారు? ఎన్ని చలానాలు విధించారు? ఎన్ని వాహనాలను నిలిపివేశారు? అని అధికారులను ప్రశ్నించారు. భారీ వాహనాల వెనుక లైట్లు, రిఫ్లెక్టర్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జాతీయ, గ్రామీణ రహదారులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి డ్రైవర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. మనిషి ప్రాణానికి విలువ లేదా? మరిన్ని ప్రాణాలు కోల్పోయిన తర్వాతే అధికారులు మేల్కొంటారా? ప్రమాదం జరిగిన తర్వాత పరిహారం అందించడం కంటే, ముందుగానే నివారణ చర్యలు చేపట్టి ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వ శాఖల బాధ్యత అని కే.ఎస్. అఘా మోహిద్దీన్ స్పష్టం చేశారు.







కామెంట్లు (0)