ఎన్నికల్లో అవకతవకలు జరగడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రతి రోజూ ఇందుకు సంబంధించి తాజా సాక్ష్యాధారాలు బయటకు వస్తూనే వున్నాయి. ఈ పరిస్థితుల్లో మహారాష్ట్రలోని బిజెపి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ప్రభుత్వ విన్యాసాల ద్వారా ప్రజా తీర్పును వక్రీకరించడానికి ప్రయత్నించింది. నవంబరు 4న ఆర్డినెన్స్‌ను జారీ చేయడం ద్వారా మహారాష్ట్ర సహకార సమాఖ్యల చట్టంలో మార్పులు చేయడానికి ఆమోద ముద్ర వేసింది. గవర్నర్ నవంబరు 6న ఆ ఆర్డినెన్స్‌ను జారీ చేశారు. దీంతో గోకుల్ డెయిరీగా పేరొందిన కొల్హాపూర్ జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సంఘాన్ని బిజెపి, దాని మిత్రపక్షాలు తక్షణమే స్వాధీనం చేసుకోవడానికి ఈ మార్పులు వెసులుబాటు కల్పించాయి. అక్టోబరు 19న జరిగిన సహకార సమాఖ్య బోర్డుకు జరిగిన ఎన్నికల్లో 25 సీట్లకు గానూ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్యానెల్ 13 గెలుచుకుంది.
మహారాష్ట్రలో అత్యంత ప్రభావవంతమైన సహకార సంస్థల్లో ఒకటైన గోకుల్ వార్షిక టర్నోవర్ దాదాపుగా రూ.4 వేల కోట్లు. పశ్చిమ మహారాష్ట్రలోని అనేక లక్షలాదిమంది పాల ఉత్పత్తిదారులతో ఈ సంస్థకు సంబంధముంది. తన రాజకీయ ఆధిపత్యాన్ని విస్తరించుకునే మరో రంగంగా సహకార రంగాన్ని చూస్తుండడంతో బిజెపి దానిపై కన్ను వేసింది. వెంటనే హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. సహకార సంస్థలను నియంత్రించే ప్రణాళిక వివిధ మార్గాల ద్వారా కొనసాగుతున్నప్పటికీ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం స్పష్టంగా గెలుపొందిన ఎన్నికను తలకిందులు చేయడానికి ప్రయత్నించడమనేది బిజెపి దుస్సాహసానికి కొత్త స్థాయిని సూచిస్తుంది. అలాగే తన చర్యలకు న్యాయ వ్యవస్థ నుండి లభిస్తున్న రక్షణను కూడా తెలియచేస్తుంది.
గోకుల్ బోర్డులోని 25 సీట్లలో 13 సీట్లను సతేజ్ పాటిల్ నేతృత్వంలో కాంగ్రెస్ మద్దతు కలిగిన రాజర్షి సాహూ షేట్కారి సంవిచారి అగధి గెలుచుకుంది. బిజెపి నేతృత్వంలోని కూటమి సభ్యులు పాల్గొనకపోవడంతో అక్టోబరు 29న చైర్మన్ ఎన్నిక ప్రతిష్టంభించింది. సమావేశానికి అవసరమైన కోరం 14 మంది సభ్యులు కూడా హాజరు కాలేదు. దీంతో కాంగ్రెస్‌కు దాని భాగస్వామ్య పక్షాలకు అనుబంధంగా వున్న డైరెక్టర్లు శశికాంత్ పాటిల్ చుయెకర్‌ను చైర్మన్‌గా ప్రకటించారు. కానీ కోరం షరతులు నెరవేరనందున ఆ ఎన్నికను పాలనా యంత్రాంగం గుర్తించడానికి తిరస్కరించింది. ఆర్డినెన్స్ ద్వారా తీసుకువచ్చిన సవరణతో ప్రభుత్వం, ఇటువంటి పెద్ద సహకార సంఘాలకు ఐదుగురు డైరెక్టర్లను నామినేట్ చేయడానికి అనుమతి లభించింది. అందులో నలుగురు నామినీలకు ఓటింగ్ హక్కులు వుంటాయి. అంతే..వెంటనే, నలుగురిని గోకుల్ బోర్డుకు నామినేట్ చేసేశారు. చైర్మన్‌ను ఎన్నుకునేందుకు నవంబరు 10న వారు బిజెపికి, దాని మిత్రపక్షాలకు ఓటు వేసేశారు. సహకార సంఘ సభ్యుల తీర్పు కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు అనుకూలంగా 13-12గా వుంది. కానీ ఓటింగ్ హక్కులు కలిగిన సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమించడంతో వారు బిజెపికి, దాని మిత్రపక్షాలకు అనుకూలంగా ఓటు వేయడంతో ఆ తీర్పు 16-13గా మారిపోయింది.
ఓడిపోయిన వారు నవంబరు 9న బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఓటింగ్ నుండి ప్రభుత్వం నామినేట్ చేసిన డైరెక్టర్లను దూరంగా వుంచాల్సిందిగా వారు కోరారు. కానీ హైకోర్టు ఆ మేరకు ఉపశమనం కలిగించలేదు. ప్రజాస్వామ్య సూత్రాలకు అనుకూలంగా జోక్యం చేసుకునేందుకు న్యాయ వ్యవస్థ చూపుతున్న సంకోచం తీవ్రంగా ఆందోళన కలిగిస్తోంది. గోకుల్ డెయిరీ ఎన్నికల్లో వచ్చిన ప్రజా తీర్పును తలకిందులు చేయడాన్ని ..ఏదో ఒకసారి జరిగిన సంఘటనగా చూడరాదు. ప్రజల ఎంపికలను ప్రభుత్వ అధికారంతో అణచివేస్తున్న ఆందోళనకరమైన ధోరణిలో ఇది మరో ఉదాహరణ మాత్రమే కానుంది.
( ‘ద హిందూ’ సంపాదకీయం)






కామెంట్‌లు (0)