చెన్నై : 2026 సాధారణ ఎన్నికల్లో చెపాక్-తిరువల్లికేని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమిళనాడు అసెంబ్లీ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సాధించిన విజయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ఎన్నికల పిటిషన్‌ను కొట్టివేసేందుకు మద్రాసు హైకోర్టు నిరాకరించింది. తేని జిల్లాకు చెందిన పి. మిలానీ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను తిరస్కరించాలని ఉదయనిధి స్టాలిన్ దాఖలు చేసిన రెండు దరఖాస్తులను జస్టిస్ జి. అరుల్ మురుగన్ శుక్రవారం కొట్టివేశారు. దీంతో ఎన్నికల పిటిషన్‌పై విచారణ కొనసాగనుంది. ఈ కేసులో తన ప్రత్యుత్తర పత్రాన్ని 2026 డిసెంబర్ 11లోగా దాఖలు చేయాలని మిలానీని న్యాయమూర్తి ఆదేశించారు.
ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి 45 రోజుల చట్టబద్ధ గడువులోగా పిటిషన్ దాఖలు చేయలేదనే కారణంతో దాన్ని తిరస్కరించాలని ఉదయనిధి స్టాలిన్ కోర్టును కోరారు. 2026 మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడినందున, జూన్ 17లోగా పిటిషన్ దాఖలు చేయాల్సి ఉందని, అయితే జూన్ 18న దాఖలు చేసినందున అది గడువు దాటిన పిటిషన్ అవుతుందని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 81 ప్రకారం ఎన్నికల పిటిషన్ దాఖలు చేయడానికి 45 రోజుల గడువు ఉంటుందని ఉదయనిధి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఈ గడువును లెక్కించేటప్పుడు ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రోజును మినహాయించకూడదని వాదించారు. 1897 నాటి జనరల్ క్లాజెస్ చట్టంలోని మొదటి రోజును మినహాయించే సూత్రం ఎన్నికల పిటిషన్లకు వర్తించదని తెలిపారు. ఎన్నికైన అభ్యర్థి ఎన్నికైన తేదీ నుంచి 45 రోజుల్లోగా పిటిషన్ దాఖలు చేయాలని ప్రత్యేక చట్టం స్పష్టంగా పేర్కొంటోందని వివరించారు. 2026 సాధారణ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల పిటిషన్లను జూన్ 17లోగా దాఖలు చేయాలని భారత ఎన్నికల సంఘం హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు సమాచారం పంపిందని కూడా ఉదయనిధి తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈ వాదనలను అంగీకరించని న్యాయమూర్తి పిటిషన్‌పై విచారణ కొనసాగించాలని నిర్ణయించారు.
2026 ఎన్నికల్లో చెపాక్-తిరువల్లికేని నియోజకవర్గం నుంచి ఉదయనిధి స్టాలిన్ 62,992 ఓట్లు సాధించి విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి, టివికె అభ్యర్థి డి. సెల్వం 55,852 ఓట్లు పొందారు. ఇదే నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పి. మిలానీ 30 ఓట్లు సాధించారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆయన ఉదయనిధి స్టాలిన్ విజయాన్ని సవాలు చేశారు.







కామెంట్‌లు (0)