పెదపరిమి లో భూసమీకరణ సభలో జిల్లా కలెక్టర్ సి ఎం సాయికాంత్ వర్మ
ప్రజాశక్తి - తుళ్లూరు :రెండో విడత భూ సమీకరణకు రైతులు సహాకరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సిఎం సాయికాంత్ వర్మ రైతులను కోరారు. మండలంలోని పెదపరిమిలో రెండో విడత భూసమీకరణపై సోమవారం జరిగిన గ్రామసభలో తాడికొండ, పెదకూరపాడు ఎమ్మెల్యే లతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అమరావతిని ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఇందుకుగాను రెండో విడత భూ సమీకరణకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందేనని చెప్పారు. భూ సమీకరణకు అందరూ సహకరించాలని కోరారు. ఎక్కువ మంది రైతులు భూ సమీకరణకు భూములను అందిస్తే వెంటనే అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

రైతులు తమ భూములకు సంబంధించిన పత్రాలను చూపించడమే కాకుండా వాస్తవికంగా భూమి సరిహద్దులను సైతం చూపించాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా ఆ మేరకు రిటర్నబుల్ ప్లాట్లను అందిస్తామని తెలిపారు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. భూ సమీకరణపై సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు. పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ.. 20 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి భూసమీకరణ ను వేగవంతం చేద్దామని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతుల సందేహాల నివృత్తికి గ్రీవెన్స్ ను నిర్వహించారు. భూములు అందించిన వారికి సంబంధిత పత్రాలను అందజేశారు. మరోవైపు రెండో విడత భూ సమీకరణపై కొందరు రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.







కామెంట్‌లు (0)