అసెంబ్లీకి రావడంలో జగన్ డక్ అవుట్ బెంగళూరు–తాడేపల్లి ప్రయాణాల్లో సెంచరీలు
ప్రజాశక్తి-కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరుకాకపోవడంపై రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బుధవారం ఆయన స్థానిక మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. బెంగళూరు–తాడేపల్లి మధ్య రాకపోకల్లో సెంచరీ పూర్తి చేసిన జగన్‌కు శుభాకాంక్షలంటూ ఎద్దేవా చేశారు. బెంగళూరు నుంచి తాడేపల్లి ప్యాలెస్‌కు రౌండ్ ట్రిప్పులు వేయడంలో సెంచరీలు సాధిస్తున్నారని, కానీ ప్రజా సమస్యలపై చర్చించే అసెంబ్లీకి రావడంలో మాత్రం డక్ అవుట్ అయ్యారని విమర్శించారు. రెండున్నరేళ్ల కాలంలో అసెంబ్లీకి జగన్ హాజరు సున్నా అని సానా సతీష్ బాబు విమర్శించారు. బెంగళూరు–తాడేపల్లి ప్రయాణాల్లో డబుల్, ట్రిపుల్ సెంచరీలు సాధించేలా కనిపిస్తున్న జగన్.. ఈసారైనా అసెంబ్లీకి వస్తారా? లేక తన పర్యటనలకే పరిమితమవుతారా ? అంటూ ప్రశ్నించారు. రౌండ్ ట్రిప్పుల్లో సెంచరీలు సాధిస్తున్న నాయకుడు ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని ఎంపి సానా సతీష్ బాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.







కామెంట్‌లు (0)