ప్రజాశక్తి-చంద్రగిరి (తిరుపతి) : తిరుపతి జిల్లా, చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని తిరుపతి రూరల్ మండలంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై హరివిల్లు రెస్టారెంట్ ఎదురుగా ద్విచక్ర వాహనం స్కిడ్ అవడంతో ఓ మహిళ లారీ కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇద్దరు మహిళలు ద్విచక్ర వాహనంపై ఈ మార్గంలో ప్రయాణిస్తుండగా, హరివిల్లు రెస్టారెంట్ ఎదురుగా ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి స్కిడ్ అయింది. దీంతో బైక్‌పై ఉన్న ఎంఆర్ పల్లికి చెందిన జగదాంబ (50) పక్కనే వెళ్తున్న లారీ కింద పడిపోయారు. లారీ చక్రం ఆమె తలపై నుంచి వెళ్లడంతో జగదాంబ అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
సిక్స్‌వే పనులతో నరకయాతన - స్థానికుల ఆగ్రహం
రేణిగుంట–సి.మల్లవరం మార్గమధ్యంలో ప్రస్తుతం రహదారి విస్తరణ, సిక్స్‌వే (ఆరు వరుసల రహదారి) నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల కారణంగా ట్రాఫిక్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని, వాహనదారులు ఏ దారిలో వెళ్లాలో తెలియక తీవ్ర అయోమయానికి గురవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు వర్షం పడటంతో రహదారిపై నీరు నిలిచిపోవడం, గుంతలకు సరైన మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల బైక్‌లు స్కిడ్ అయి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టడంతో పాటు, ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.







కామెంట్‌లు (0)