ఏడుగురి ఆచూకీ ఏదీ.. పది రోజులుగా ఎదురుచూపులే!
కడలి వైపు ఆశగా చూస్తున్న కుటుంబాలు.. కన్నీటితో గడుపుతున్న భార్యాపిల్లలు
నేవీ, కోస్టుగార్డు విస్తృత గాలింపు.. అయినా లభించని ఆచూకీ
ప్రజాశక్తి -యు.కొత్తపల్లి (కాకినాడ) : కడలికి వెళ్లిన తమవారు క్షేమంగా తిరిగి వస్తారని ఆశగా ఎదురుచూస్తున్న ఆ కుటుంబాలకు రోజులు గడుస్తున్నా నిరీక్షణ మాత్రం తీరడం లేదు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు తమవారి క్షేమ సమాచారం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. సముద్రంలోకి వెళ్లిన వారు ఏమయ్యారో.. ఎక్కడున్నారో.. కనీసం ప్రాణాలతో ఉన్నారో లేదో తెలియని పరిస్థితి. ఒకవైపు గాలింపు చర్యలు కొనసాగుతున్నా మరోవైపు ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది.
ఉప్పాడ శివారు సుబ్బంపేటకు చెందిన గరికిన సింహాద్రి, సూరాడ కోదండ, కందాల రాము, సూరాడ చిన్న, గంపల ప్రకాశ్, తిర్రి నారాయణ, మేరుగు నారాయణ అనే ఏడుగురు మత్స్యకారులు ఈ నెల 11వ తేదీన చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు. గరికిన సింహాద్రికి చెందిన బోటుపై పూరి పారతిప్ప సమీపంలో వేటకు వెళ్లిన వీరు తిరిగి రాకపోవడంతో గల్లంతైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వారి కుటుంబాల్లో ఆందోళన మొదలైంది.
విస్తృతంగా గాలిస్తున్నా దొరకని జాడ ..
గల్లంతైన మత్స్యకారుల కోసం నేవీ, కోస్టుగార్డు సిబ్బంది సముద్రంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. నౌకలు, బోట్ల ద్వారా సముద్రంలో అన్వేషణ కొనసాగిస్తున్నారు. హెలికాప్టర్ల సహాయంతోనూ గాలింపు చేపడుతున్నప్పటికీ ఇప్పటివరకు ఏడుగురి ఆచూకీ లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇతర దేశాల సముద్ర జలాల్లోకి వెళ్లి ఉంటారనే అనుమానంతో బంగ్లాదేశ్ తదితర ప్రాంతాల్లోనూ విచారణ చేపడుతున్నట్లు సమాచారం.
ఇంటికి వస్తారని ఎదురుచూస్తూ ..
సముద్రంలోకి వెళ్లిన తమవారితో సంబంధాలు తెగిపోవడం, ఫోన్లు పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇంటి నుంచి వెళ్లినప్పుడు నవ్వుతూ వీడ్కోలు చెప్పిన తమవారు మళ్లీ ఎప్పుడు కనిపిస్తారోనని భార్యలు, పిల్లలు, తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఇంటి గడప దగ్గర అడుగుల చప్పుడు వినిపించినా తమవారే వచ్చారేమోనని ఆశగా చూస్తున్న పరిస్థితి నెలకొంది.వారి రాక కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు ప్రతి రోజు ఒక యుగంలా గడుస్తోంది. కనీసం ఒక్క ఫోన్ కాల్ అయినా వస్తుందేమోనని ఆశపడుతున్నారు. సముద్రంలో గాలింపు కొనసాగుతోందన్న సమాచారం కొంత ధైర్యాన్నిస్తున్నా, ఆచూకీ మాత్రం తెలియకపోవడంతో వారి ఆవేదన మరింత పెరుగుతోంది.
ప్రభుత్వమే అండగా నిలవాలి ..
ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ గుర్తించేందుకు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. నేవీ, కోస్టుగార్డు, మెరైన్ పోలీసు విభాగాలు సమన్వయంతో అన్ని మార్గాల్లో అన్వేషణ కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. తమ కుటుంబ పెద్దలు క్షేమంగా తిరిగి వస్తారనే ఆశతో ఎదురుచూస్తున్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరుతున్నారు.సముద్రం పొట్టన పెట్టుకుందా.. లేక ఎక్కడైనా సురక్షితంగా ఉన్నారా? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియక సుబ్బంపేటలోని ఆ ఏడు కుటుంబాలు కన్నీటితో రోజులు వెళ్లదీస్తున్నాయి. వారి ఆచూకీ లభించి మళ్లీ తమ ఇళ్లలో ఆనందం వెల్లివిరియాలని గ్రామస్థులు ఆకాంక్షిస్తున్నారు.









కామెంట్లు (0)