మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘అక్వాన్’ ముప్పు... అన్నదాతల్లో ఆందోళన!

3 రోజుల క్రితం

‘అక్వాన్’ ముప్పు... అన్నదాతల్లో ఆందోళన! image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 06:03 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి–గన్నవరం : ​ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు.. మరోవైపు పాలకుల నిర్లక్ష్యం.. వెరసి కృష్ణా జిల్లాలోని గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అతివృష్టి, అనావృష్టి, ఎల్‌నినో ప్రభావంతో ఎదురైన ప్రతికూల పరిస్థితులను తట్టుకుని, అప్పులు చేసి సాగు చేసిన వరి పంట మరో వారం, పది రోజుల్లో కోతకు రానుంది. ఈ తరుణంలో ‘అక్వాన్’ తుపాను హెచ్చరికలు అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

​రూ.40 వేల పెట్టుబడి.. చేతికందే పంటపై గంపెడాశలు

​ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో సాగునీటి ఇబ్బందులు, తెగుళ్ల బెడదను రైతులు తీవ్రంగా ఎదుర్కొన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు పెరగడంతో ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టారు. గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లోని సారవంతమైన భూముల్లో వరి పైరు ప్రస్తుతం గింజ పాలుపోసుకునే దశ దాటి కోతకు సిద్ధమవుతోంది. మరో పది రోజుల్లో పంట చేతికందుతుందనుకుంటున్న తరుణంలో తుపాను హెచ్చరికలు రైతులను కలవరపెడుతున్నాయి. ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిస్తే పైరు నేలకొరిగి, పంట నీట మునిగే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి కష్టపడి పెట్టిన పెట్టుబడి కళ్లముందే వృథా అవుతుందేమోనని భయపడుతున్నారు.

​వెంటాడుతున్న 2024 బుడమేరు ముంపు జ్ఞాపకాలు

​2024లో బుడమేరు వరదల కారణంగా ఎదురైన అనుభవాలు మూడు మండలాల రైతులను ఇప్పటికీ వెంటాడుతున్నాయి. ఉంగుటూరు మండలంలో సుమారు తొమ్మిది వేల ఎకరాలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. బుడమేరు, అనుబంధ కాలువల్లో పూడిక, గుర్రపుడెక్క పేరుకుపోవడం వల్ల వరద నీరు సక్రమంగా బయటకు వెళ్లకపోవడం ముంపు తీవ్రతకు కారణమైందని రైతులు పేర్కొంటున్నారు. బాపులపాడు, గన్నవరం మండలాల్లోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొని రైతులు కోలుకోలేని నష్టాన్ని చవిచూశారు. గత అనుభవాలు కళ్లముందు కదలాడుతున్నప్పటికీ, నేటికీ ప్రధాన డ్రెయినేజీలు, బుడమేరు ప్రవాహ మార్గాల్లో పూడిక, గుర్రపుడెక్క తొలగింపు పనులు పూర్తిస్థాయిలో జరగలేదని రైతులు ఆరోపిస్తున్నారు. మరోసారి భారీ వర్షాలు కురిస్తే 2024 నాటి ముంపు పరిస్థితులు పునరావృతమవుతాయేమోనని ఆందోళన చెందుతున్నారు.

​ప్రభుత్వ భరోసా ఏదీ?

​తుపాను ముప్పు పొంచి ఉన్న వేళ రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తగిన భరోసా లభించడం లేదని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ముందస్తుగా పంట కోసి ధాన్యం విక్రయించాలనుకున్నా, తేమ శాతం నిబంధనల కారణంగా కొనుగోళ్లు జరగడం లేదని రైతులు వాపోతున్నారు. భారీ వర్షాలకు ధాన్యం తడిసినా, రంగు మారినా ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందనే స్పష్టమైన హామీ లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మూడు మండలాల్లోని ప్రధాన డ్రెయినేజీలు, బుడమేరు, అనుబంధ మురుగునీటి కాలువల్లో పూడిక తొలగింపు పనులు పూర్తికాకపోవడం వల్ల భారీ వర్షాలు కురిస్తే పొలాల్లో నీరు నిలిచిపోయే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్