నిద్రలో నేషనల్ హైవే అధికారులు ?
గుంతలతో ప్రమాదాల వలయం..
మరోసారి రెండు లారీలు ఢీ
ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజల డిమాండ్
ప్రజాశక్తి - పుల్లంపేట (తిరుపతి) : కడప–చెన్నై జాతీయ రహదారి (ఎన్‌హెచ్-716)లో తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం సీతారాంపేట బ్రిడ్జి మరోసారి ప్రమాదానికి వేదికైంది. బ్రిడ్జిపై రహదారి పూర్తిగా దెబ్బతినడం, భారీ గుంతలు ఏర్పడటంతో ముందుగా వెళ్తున్న లారీ వేగం తగ్గించగా, వెనుక నుంచి వచ్చిన మరో లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోయినా రెండు లారీల ముందు భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. స్థానికుల కథనం ప్రకారం, సీతారాంపేట బ్రిడ్జిపై రహదారి చాలా కాలంగా గుంతలతో నిండిపోయింది. ఈ గుంతల కారణంగా ప్రతి వాహనం వేగం తగ్గించాల్సి వస్తోంది. అయితే వెనుక నుంచి వచ్చే వాహనాలు సమయానికి నియంత్రించలేక తరచూ ఢీకొంటున్న ఘటనలు చోటుచేసుకుంటున్నయి ఇటీవల ఇదే బ్రిడ్జిపై జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. అయినప్పటికీ నేషనల్ హైవే అధికారులు శాశ్వత మరమ్మతులు చేపట్టకపోవడం తీవ్ర నిర్లక్ష్యమని ప్రజలు మండిపడుతున్నారు. దినపత్రికలలో సోషల్ మీడియాలో ఎన్ని మార్లు ప్రచురణ అయిన కూడా చెల్లించని నేషనల్ హైవే అథారిటీ వారు సామాన్య ప్రజల ప్రాణాలు అంటే అంత చులకన స్థానిక ప్రజలు వాహనదారులు వాపోయారు. కడప–తిరుపతి–చెన్నై మార్గం రాష్ట్రంలో అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారుల్లో ఒకటి. ప్రతిరోజూ వేలాది కార్లు, లారీలు, బస్సులు, ద్విచక్ర వాహనాలు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటాయి. ఇలాంటి కీలక రహదారిపై ప్రమాదకర స్థితిలో ఉన్న బ్రిడ్జిని నిర్లక్ష్యం చేయడం వల్ల సామాన్య ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.







కామెంట్‌లు (0)