మంగళవారం, 11 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

చిన్నపాటి వర్షానికే చెరువుగా మారిన నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రి

1 గంట క్రితం

ffda63f3-f7b7-42da-b573-426a9bea8786.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 11, 2026, 05:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • నీటిలో నడవలేక రోగుల అవస్థలు..

  • పట్టించుకోని అధికారులు, అభివృద్ధి కమిటీ సభ్యులు

ప్రజాశక్తి-నాయుడుపేట: స్వల్ప వర్షానికే నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణ జలమయంగా మారడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రి ముఖద్వారం నుంచి లోపలి వరకు మోకాళ్ల లోతు నీరు నిలిచిపోవడంతో గర్భిణీలు, వృద్ధులు, చిన్నారులు, బాలింతలు నీటిలోనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులను స్ట్రెచర్లపై తరలించడంలోనూ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను కళ్లారా చూస్తున్న ఆసుపత్రి సిబ్బంది సైతం పట్టించుకోవడం లేదని రోగులు, వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్ది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని పాలకులు చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇందుకు నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితి నిదర్శనంగా నిలుస్తోంది.సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమే ఆసుపత్రి ఆవరణలో వర్షపు నీరు నిలిచిపోవడానికి ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు. వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో ప్రతి వర్షానికీ ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి ఆవరణలో మురుగు నీరు నిలిచిపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే వారికి ఇలాంటి అపరిశుభ్ర వాతావరణం వల్ల మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సూళ్లూరుపేట ఎమ్మెల్యే ఆసుపత్రిని సందర్శించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, చిన్నచిన్న సమస్యలు సైతం పరిష్కారం కాకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆసుపత్రి ఆవరణలో నిలిచిన నీటిని వెంటనే తొలగించి, శాశ్వత పరిష్కారంగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్