సీనియర్ నటుడు, నాటకరంగ ప్రముఖుడు, రచయిత ఎల్లాప్రగడ సౌభాగ్య కృష్ణేశ్వరరావు (71) మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ, గుండె సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ఏటీ అగ్రహారంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. బుధవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్ననాటి నుంచే కళలపై ఆసక్తి పెంచుకున్న కృష్ణేశ్వరరావు పాఠశాలలో చదువుకునే రోజుల్లోనే రంగస్థలంపై అడుగుపెట్టారు. ఆయన నటించిన తొలి నాటకం ‘వాపస్’. దాదాపు 1,500కు పైగా నాటకాల్లో నటించడంతోపాటు, ఎన్నో ప్రయోగాత్మక నాటకాలను రచించి, ప్రదర్శించారు. పలు నంది అవార్డులు అందుకున్నారు. నాటకరంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేసిన ఆయన పొన్నూరు కళాపరిషత్ వ్యవస్థాపకుల్లో ఒకరు. సీనియర్ నటుడు ఎం. ప్రభాకర్ రెడ్డి ప్రోత్సాహంతో ‘ప్రచండ భారతం’ చిత్రంతో కృష్ణేశ్వరరావు వెండితెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రానికి కథను కూడా ఆయనే అందించారు. అనంతరం ‘శ్రీరాములయ్య’, ‘జయం మనదేరా’, ‘భద్రాచలం’ తదితర చిత్రాలకు రచయితగా పనిచేశారు. ‘పరశురామ్’ చిత్రానికి సంభాషణలు, ‘నేను సైతం’ చిత్రానికి పాటలు రాశారు. నటుడిగా ‘గోపి గోపిక గోదావరి’, ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’, ‘కొంచెం టచ్‌లో ఉంటే చెబుతాను’ వంటి వంశీ చిత్రాల్లో తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘చందమామ కథలు’ చిత్రంలో పోషించిన పాత్రకు నంది అవార్డు అందుకున్నారు. ‘విరూపాక్ష’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘నాంది’ తదితర చిత్రాల్లోనూ నటించారు. షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్‌తోపాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం వహించడం ద్వారా జాషువా సాంస్కృతిక వేదిక, ఎంబీ విజ్ఞానకేంద్రాలతో ఆయనకు అనుబంధం ఉంది. ఆయన మృతిపట్ల సినీ, నాటకరంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
నటుడు కృష్ణేశ్వరరావు కన్నుమూత
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 11, 2026, 07:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)