ప్రజాశక్తి-చంద్రగిరి (తిరుపతి) : చంద్రగిరి మండలం నరసింగాపురం గ్రామ పంచాయతీ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల నిర్వహణ, ప్రజా సేవలో నాణ్యత, పారదర్శక పాలనలో మరో విశిష్ట గుర్తింపును సాధించింది. సదుపాయాల నిర్వహణకు సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణం ISO 41001 సర్టిఫికేషన్‌ను నరసింగాపురం గ్రామ పంచాయతీ అందుకుంది.
చంద్రగిరి మండలంలోని నరసింగాపురం గ్రామ పంచాయతీని సమగ్ర మౌలిక వసతులు, ప్రజా సదుపాయాల నిర్వహణ మరియు సుస్థిర గ్రామీణ పాలనలో ఆదర్శ గ్రామ పంచాయతీగా అభివృద్ధి చేయడానికి పంచాయతీ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది.
ISO 41001 ప్రాథమిక ఆడిట్‌లో సూచించిన అంశాలపై ప్రత్యేక కార్యచరణ చేపట్టి, పంచాయతీ పరిధిలోని ఆస్తుల నిర్వహణ, నిర్వహణ రిజిస్టర్లు, ప్రివెంటివ్ మెయింటనెన్స్ షెడ్యూల్స్, ఫిర్యాదుల పరిష్కారం, నీటి నాణ్యత పర్యవేక్షణ, పారిశుధ్యం, విద్యుత్ వినియోగం, ఆరోగ్యం, విద్య, డిజిటల్ సేవలు, ఆర్థిక నిర్వహణ తదితర అంశాల్లో పలు వ్యవస్థలను మరింత పటిష్టం చేశారు.
ఆడిట్ అనంతరం ఆస్తుల సమగ్ర డిజిటల్ ఇన్వెంటరీ, నిర్వహణ లాగ్లు, నీటి పరీక్షలు మరియు క్లోరినేషన్ రిజిస్టర్, వ్యర్థాల సేకరణ రిజిస్టర్, విద్యుత్ నిర్వహణ రిజిస్టర్, ఆరోగ్య సేవల రిజిస్టర్లు, పాఠశాల పారిశుధ్య తనిఖీ రిజిస్టర్లు, రైతు సేవల లాగ్బుక్, IT ఆస్తుల జాబితా, పన్నుల వసూళ్లు మరియు గ్రాంట్ల వినియోగానికి సంబంధించిన రిజిస్టర్లను ఏర్పాటు చేశారు.
గ్రామ పంచాయతీలో 755 కుటుంబాలకు ప్రతిరోజూ తడి, పొడి వ్యర్థాల సేకరణ, సేంద్రియ వ్యర్థాలతో వర్మీకంపోస్ట్ తయారీ, 100 శాతం గృహాలకు పనిచేస్తున్న కుళాయి కనెక్షన్లు, అన్ని ఆవాసాల్లో LED వీధి దీపాలు, 1.68 కి.మీ. సిమెంట్ కాంక్రీట్ రహదారులు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, రైతు సేవా కేంద్రం వంటి ప్రజా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
సదుపాయాల నిర్వహణలో భాగంగా ముందస్తు నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ, నీటి ట్యాంకులు, కమ్యూనిటీ హాళ్లు, వీధి దీపాల వ్యవస్థలపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను కూడా వేగవంతం చేశారు.
స్వర్ణ గ్రామం (సచివాలయం) వ్యవస్థతో సమన్వయం చేస్తూ 32 రకాల ప్రజా సేవలను గ్రామస్థాయిలో అందించడం, డిజిటల్ సేవలు, SLA ఆధారిత ఫిర్యాదుల పరిష్కారం మరియు పారదర్శక ఆర్థిక నిర్వహణకు ప్రాధాన్యతనిస్తున్నారు.
ఈ ISO 41001 సర్టిఫికేషన్ నరసింగాపురం గ్రామ పంచాయతీ చేపట్టిన సుస్థిర మౌలిక వసతుల నిర్వహణ, ప్రజా ఆస్తుల సంరక్షణ, పారదర్శక పరిపాలన మరియు నాణ్యమైన ప్రజా సేవలకు గుర్తింపుగా నిలుస్తుందని అధికారులు తెలిపారు.
గ్రామ పంచాయతీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన జిల్లా పంచాయతీ అధికారి శ్రీమతి డి.సుశీల దేవి, చంద్రగిరి మండల ఉప మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ వెంకటరత్నం, నరసింగాపురం పంచాయతీ అభివృద్ధి అధికారి శ్రీ నాగేంద్ర మరియు సిబ్బందిని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ ఎస్. వెంకటేశ్వర్, ఐఏఎస్ అభినందించారు.
నరసింగాపురం గ్రామ పంచాయతీ సాధించిన ఈ గుర్తింపు తిరుపతి జిల్లాలో గ్రామీణ పాలనలో నాణ్యత, సదుపాయాల నిర్వహణ మరియు నిరంతర మెరుగుదలకు ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తుంది.







కామెంట్‌లు (0)