బుధవారం, 09 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రైతులకు నాణ్యమైన బొప్పాయి మొక్కలు అందజేయాలి : జిల్లా ఉద్యాన శాఖ అధికారి

54 నిమిషాల క్రితం

tirupati
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 04:41 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - రైల్వేకోడూరు : రైతులకు నాణ్యమైన బొప్పాయి మొక్కలను నర్సరీ యజమానులు అందజేయాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి జయ భరత్ రెడ్డి అన్నారు. బొప్పాయి విత్తనాల లభ్యత, నాణ్యత, ధరలు, బొప్పాయి నర్సరీలలో పాటించవలసిన యాజమాన్య పద్ధతులపై ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో బొప్పాయి విత్తన డీలర్లు, బొప్పాయి నర్సరీ యజమానులు, రైతులతో బుధవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని బొప్పాయి నర్సరీలు నర్సరీ యాక్ట్, 2010 నియమ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్, లైసెన్స్ పొందాలని సూచించారు. నర్సరీ యజమానులు విత్తనాల నిల్వ వివరాలు,విత్తన మొలక శాతం, మొక్కల విక్రయ రిజిస్టర్ తదితర రికార్డులను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. నర్సరీల నుండి మొక్కలు కొనుగోలు చేసే ప్రతి రైతుకు తప్పనిసరిగా బిల్లు అందించాలని ఆదేశించారు. హార్టికల్చర్ ఆఫీసర్ ఎం. వెంకట భాస్కర్ మాట్లాడుతూ, ప్రతి నర్సరీ కార్యకలాపాలను సంబంధిత వి హెచ్ ఏ ల ద్వారా క్రమం తప్పకుండా పర్యవేక్షించి, రైతులకు నాణ్యమైన మొక్కలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. శాస్త్రవేత్త డా. చంద్ర మోహన్ రెడ్డి మాట్లాడుతూ, నర్సరీలలో వైరస్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా కీటక నిరోధక వలలను నర్సరీలలో వినియోగించాలని సూచించారు. రసం పీల్చే పురుగులు ద్వారా వైరస్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున నర్సరీలలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. బొప్పాయి మొక్కలను పొలంలో నాటిన తరువాత మంచి స్థాపన కోసం కనీసం 45 రోజుల పాటు నర్సరీలో ఆరోగ్యంగా పెంచిన మొక్కలను మాత్రమే రైతులకు అందించాలని నర్సరీ యజమానులకు సూచించారు. ఎం ఏ ఓ సందీప్ మాట్లాడుతూ, ప్రస్తుత సీజన్‌లో బొప్పాయి విత్తనాలకు ఎటువంటి కొరత ఉండదని తెలిపారు. విత్తన డీలర్ల ద్వారా రైతులకు అవసరమైన మేరకు విత్తనాలు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విత్తన డీలర్లు తమ వద్ద ఉన్న విత్తన నిల్వలు, విక్రయ వివరాలను విత్తన రిజిస్టర్లలో సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. రైతులకు నాణ్యమైన బొప్పాయి విత్తనాలు మరియు ఆరోగ్యకరమైన మొక్కలు అందించడంతో పాటు, విత్తనాల ధరలు విషయంలో కూడా నర్సరీ యజమానులు పారదర్శకత పాటించేలా ఉద్యాన శాఖ నిరంతరం పర్యవేక్షిస్తుందని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో ఉద్యానవన అధికారులు చిట్వేల్ లోకేష్, రైల్వేకోడూరు మండల ఆర్ ఎస్ కె సిబ్బంది, బొప్పాయి విత్తన డీలర్లు, నర్సరీ యజమానులు, బొప్పాయి రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్