భీమిలి ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో రూ.28 లక్షల ఎంపీ లాడ్స్ నిధులతో ఏర్పాటు చేసిన నూతన వైద్య సదుపాయాలను విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్ శనివారం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ అభివృద్ధి పనులను చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించి పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా నవజాత శిశువుల్లో కామెర్ల చికిత్సకు ఉపయోగపడే ఫోటోథెరపీ యంత్రాల కోసం ప్రత్యేక గదిని, శస్త్రచికిత్సలకు ముందు రోగులను సిద్ధం చేసేందుకు ప్రీ-ఆపరేటివ్ గదిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రోగుల నిర్ధారణ పరీక్షల కోసం నూతన అల్ట్రాసౌండ్ యంత్రాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. భీమిలి సిహెచ్‌సిని మరింత అభివృద్ధి చేసేందుకు అదనపు వార్డుల నిర్మాణంతోపాటు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు. ఇందుకు సుమారు రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు అవసరమవుతాయని, ప్రభుత్వ సహకారంతో మ్యాచింగ్ గ్రాంట్ సమకూర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వైద్యం, విద్యారంగాల్లో ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూర్చే పనులకు ఎంపీ లాడ్స్ నిధుల ద్వారా ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు గంటా నూకరాజు, పాసి నర్సింగరావు, డిఎఎన్ రాజు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఫణి కుమార్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)