ముంబయి : బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమిర్‌కు సోషల్ మీడియా ద్వారా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో ఓ బెదిరింపు సందేశం వచ్చినట్టు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ బెదిరింపు సందేశంలో ఆమిర్ ఖాన్ మూడో వివాహాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. అయితే, ఈ పోస్టులు, ఆడియోల ప్రామాణికతను ఇప్పటివరకు పోలీసులు ధ్రువీకరించలేదు.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఆర్జూ బిష్ణోయ్, టైసన్ బిష్ణోయ్ పేరుతో ఈ హెచ్చరికలు వెలువడ్డాయి. ‘లవ్ జిహాద్ పేరుతో సంస్కృతికి విరుద్ధంగా వ్యవహరించే ఆమీర్ ఖాన్ వంటి వారిని సహించేది లేదు. ఆయన చేసిన పనులకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ కనిపిస్తే అక్కడ బుద్ధి చెబుతాం’ అని ఆడియో క్లిప్‌లో సదరు వ్యక్తి పేర్కొన్నాడు. ఇటీవల ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకోవడంతో కొందరు రాజకీయ నాయకులు, మతపరమైన సంస్థలు విమర్శలు గుప్పించాయి. మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే కూడా ఈ వివాహంపై వ్యాఖ్యలు చేస్తూ.. 'లవ్ జిహాద్' అంశాన్ని ప్రస్తావించారు. ఈ వివాదాలపై ఇప్పటికే ఆమిర్ ఖాన్ స్పందించారు. తన వివాహాల్లో మత మార్పిడి జరగలేదని స్పష్టం చేశారు. తన మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావు, అలాగే ప్రస్తుత భార్య గౌరీ స్ప్రాట్ ఎవరూ తమ మతాన్ని మార్చుకోలేదని తెలిపారు. తమది అన్ని మతాలను గౌరవించే కుటుంబమని చెప్పారు. కాగా, తాజాగా ఆమిర్‌కు వచ్చిన ఈ బెదిరింపు వ్యవహారంపై అధికారిక పోలీసు ప్రకటన లేదా దర్యాప్తు వివరాలు వెలువడలేదు.







కామెంట్‌లు (0)