తెలంగాణ : హైదరాబాద్ షేక్‌పేట్‌లోని వినోభానగర్ హనుమాన్ ఆలయం వద్ద అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మోగుతున్న లౌడ్ స్పీకర్లపై సినీ నటుడు అల్లు శిరీష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులను ఆశ్రయించారు. షేక్‌పేట్ అపర్ణ వన్ అపార్ట్‌మెంట్ నివాసిగా పేర్కొంటూ, అర్ధరాత్రి 2, 3 గంటల వరకు మైకుల మోత కొనసాగుతోందని హైదరాబాద్ సిటీ పోలీసులను ట్యాగ్ చేస్తూ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఫిర్యాదు చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
అర్ధరాత్రి సంగీతంతో స్థానికులకు నరకం గత కొన్ని రోజులుగా పరిమితికి మించిన శబ్దంతో హనుమాన్ ఆలయం వద్ద పాటలు ప్లే చేస్తున్నారని అల్లు శిరీష్ తన పోస్టులో పేర్కొన్నారు. అర్ధరాత్రి వేళల్లో వస్తున్న భారీ శబ్దాల వల్ల తమ సొసైటీలోని వృద్ధులు, చిన్నపిల్లలు, ఉద్యోగులు నిద్రలేక తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, గణేష్ నిమజ్జనాలు ముగిసే వరకు (సెప్టెంబర్ 25) వేచి చూడాలని కోరారని, అయితే పండుగ ముగిసినా మైకుల శబ్దం మాత్రం తగ్గలేదని స్పష్టం చేశారు. ఈ సమస్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని అల్లు శిరీష్ కోరడంతో.. ఈ ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిలింనగర్ ఎస్‌హెచ్‌ఓను ఆదేశించినట్లు హైదరాబాద్ సిటీ పోలీసులు బదులిచ్చారు.
అల్లు శిరీష్ చేసిన ఫిర్యాదుపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. అర్ధరాత్రి వేళల్లో అధిక శబ్దాల వల్ల స్థానికులకు ఇబ్బంది కలగడం వాస్తవమేనని, ప్రజా సౌకర్యం కోసం ధ్వని కాలుష్యంపై ఫిర్యాదు చేయడం సముచితమేనని పలువురు ఆయనకు మద్దతు తెలిపారు. అయితే మరికొందరు మాత్రం మసీదుల్లో నుంచి రోజూ వచ్చే మైకుల శబ్దాలపై కూడా ఇదే విధంగా స్పందిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆలయాల వద్ద మాత్రమే కాకుండా అన్ని ప్రార్థనా స్థాలాల్లోనూ నిబంధనలు సమానంగా అమలు చేయాలంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.








కామెంట్లు (0)