mh ad
గురువారం, 25 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అమరావతిలో బాలయ్య సినిమా ప్రారంభం

2 గంటల క్రితం

balayya
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 25, 2026, 08:54 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • క్లాప్ కొట్టిన మంత్రి లోకేష్

ప్రజాశక్తి - తుళ్లూరు (గుంటూరు జిల్లా) : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం (వర్కింగ్ టైటిల్ 'NBK 112') ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా గురువారం ఘనంగా ప్రారంభమైంది. సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సినిమా ప్రారంభోత్సవం అనంతరం నిర్మాత సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని సుమారు రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల భారీ వ్యయంతో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా ప్రారంభం కానుందని, వచ్చే ఏడాది, అంటే 2027 వేసవి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఒక భారీ సినిమా ప్రారంభోత్సవ వేడుకను నిర్వహించాలనేది బాలకృష్ణ సుదీర్ఘకాల కల అని, ఆ కల తమ సినిమాతో సాకారం కావడం ఎంతో గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. "నేను ప్రకాశం జిల్లాకు చెందినవాడిని. మన సొంత రాజధాని నడిబొడ్డున ఈ సినిమాను ప్రారంభించడం నా జీవితంలో మరువలేని అనుభూతి. గత మూడు, నాలుగేళ్లుగా బాలయ్య గారితో సినిమా చేయాలన్న నా ప్రయత్నం ఇప్పటికి ఫలించింది" అని ఆయన చెప్పారు. ఈ సినిమా కేవలం కమర్షియల్ వినోదాన్ని మాత్రమే కాకుండా, ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక కళాకారులకు, సాంకేతిక నిపుణులకు ఒక అద్భుతమైన వేదికగా నిలవనుందని నిర్మాతలు తెలిపారు. ఆంధ్రాలో అపారమైన నైపుణ్యం కలిగిన యువత ఉన్నారని, వారందరికీ తమ చిత్రంలో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సినిమా స్పూర్తితో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ నలుమూలలా అత్యాధునిక ఫిల్మ్ స్టూడియోలు ఏర్పాటయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తూనే, మాస్ ఎలిమెంట్స్‌ను జోడించి సినిమాలు తీసే కొరటాల శివ.. బాలయ్యను వెండితెరపై ఏ స్థాయిలో చూపించ బోతున్నారోనని నందమూరి అభిమానులు అంచనాలు పెంచేసుకుంటున్నారు. రాజధానిలో భారీ సినిమా ప్రారంభోత్సవం జరగడం ఇదే తొలిసారి.

అమరావతిలో సందడి

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న 112వ చిత్రం గురువారం ప్రారంభం కావడంతో సినీ ప్రేక్షకులు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టి షూటింగ్‌ను ప్రారంభించారు. బాలకృష్ణ కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. "అమరావతిలో సినిమా ప్రారంభోత్సవం జరగడం, దానికి నేను అతిథిగా రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. భవిష్యత్తులో మరిన్ని సినిమాలు ఇక్కడి నుంచే ప్రారంభం కావాలని కోరుకుంటున్నాను" అని ఆయన అన్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు బాలయ్యకు ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్, దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలు దగ్గుబాటి సురేశ్, చెరుకూరి సుధాకర్, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, ఎంఎస్ రాజు తదితర సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్