70 ఎకరాల భూమి కూడా..
రామ్‌దేవ్‌బాబా యోగా డేకు హాజరైన కొద్ది రోజుల్లోనే జిఒ
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న పతంజలి ఫుడ్-హెర్బల్ పార్క్ కు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలు మంజూరు చేసింది. రామ్‌దేవ్ బాబా నేతృత్వంలోని ఈ సంస్థకు బిజెపి, ఎన్‌డిఎ నేతృత్వంలోని కేంద్ర, రాష్ట ప్రభుత్వాల కంటే అధికంగా ప్రోత్సాహకాలు అందించడం గమనార్హం. ఈ నెల 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలో యోగా డే వేడుకలకు రామ్‌దేవ్‌బాబా హాజరయ్యారు. ఆ తరువాత కొద్దిరోజుల్లోనే భారీ రాయితీలతో ఈ జిఒ జారీ కావడం చర్చనీయాంశమైంది. ఈ సంస్థకు వివిధ రంగాల్లో ఏకంగా రూ.131 కోట్ల వరకు ప్రోత్సాహకాలు ప్రకటించడం విశేషం. జిల్లాలోని చిన్నరావుపల్లి గ్రామంలో 70 ఎకరాల భూమిని కూడా మల్టీ కమోడిటీ ప్రాసెసింగ్ లైన్లతో ఈ పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు కేటాయించారు. ఈ ప్రాజెక్టును మొత్తం రూ.370.10 కోట్ల పెట్టుబడితో ప్రతిపాదించగా, దాని ద్వారా 2,000 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించే అవకాశముందని ప్రభుత్వం తెలిపింది.
ఈ ప్రతిపాదనపై రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమగ్రంగా చర్చించి, ఎపి ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ రూ.131.41 కోట్ల వరకు ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేయాలని సిఫారసు చేసింది. ఇది స్థిర మూలధన పెట్టుబడిలో 39.37 శాతంగా ఉంటుంది. ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిశీలించి, పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్‌కు ఈ ప్రోత్సాహకాల మంజూరుకు ఆమోదం తెలిపింది. ఉపాధి సబ్సిడీ మినహా మిగతా ప్రోత్సాహకాలు వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైన తేదీ నుంచి ఐదేళ్లలో విడతల వారీగా విడుదల చేయనున్నారు. ఉపాధి సబ్సిడీ మాత్రం తొమ్మిదేళ్ల కాలంలో చెల్లించనున్నారు.
ప్రభుత్వం మంజూరు చేసిన ప్రోత్సాహకాలలో 25 శాతం మూలధన సబ్సిడీగా రూ.60.65 కోట్లు, ఐదేళ్లపాటు యూనిట్‌కు రూ.1 చొప్పున విద్యుత్ ఖర్చు రీయంబర్స్‌మెంట్‌గా రూ.3.25 కోట్లు, విద్యుత్ చార్జీల రీయంబర్స్‌మెంట్‌గా మరో రూ.3.25 కోట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో తయారు చేసి రాష్ట్రంలోనే విక్రయించే ఉత్పత్తులపై రాష్ట్రానికి నగదు రూపంలో లభించే ఎస్‌జిఎస్‌టి మొత్తాన్ని 100 శాతం వరకు ఐదేళ్లపాటు గరిష్ఠంగా రూ.40 కోట్లు తిరిగి చెల్లించనున్నారు. వీటికి అదనంగా ఉపాధి సబ్సిడీగా 10 శాతం వరకు, గరిష్ఠంగా రూ.24.26 కోట్లు మంజూరు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్రలో ఆహార ప్రాసెసింగ్ రంగానికి ఊతమిచ్చే అవకాశం ఉందని, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు కూడా బలం చేకూరుతుందని ఉత్తర్వుల్లో పేర్కొనడం విశేషం.









కామెంట్‌లు (0)