27న గంథ మహోత్సవం
భారీగా తరలివస్తున్న యాత్రికులు
ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువులో రొట్టెల పండుగను శుక్రవారం నుంచి ఐదురోజులపాటు నిర్వహించనున్నారు. అందుకు సంబంధించి యాత్రికులు ఇప్పటికే నెల్లూరు చేరుకుంటున్నారు. దేశ, విదేశాల నుంచి కోర్కెల రొట్టెల కోసం యాత్రికులు తరలివస్తున్నారు. ఈ నెల 26వ తేదీ సంధల్ మాల్, 27న గంథ మహోత్సవం, 28న రొట్టెల పండుగ, 29న తహలీల్ ఫాతేహ, 30న ముగింపు వేడుకలతో రొట్టెల పండగ ముగియనుంది. రొట్టెల పండుగకు తరలివచ్చే యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎస్‌పి అజిత వేజెండ్ల, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కార్పొరేషన్ నందన్ నిరంతరం ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ అధికారులకు సూచనలు ఇస్తున్నారు. మతాల పేర విధ్వంసాలు సృష్టిస్తోన్న ప్రస్తుత తరుణంలొ హిందూ, ముస్లిం బాయ్... బాయ్ అంటూ మతసామరస్యానికి ప్రతీకగా బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ నిలుస్తోంది.









కామెంట్‌లు (0)