సంకుచిత మతతత్వంతో సమాజాన్ని నిరంతరం సంక్షోభంలో పెట్టడం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పోకడ. దాని పుట్టుకలోనే ఆ అవలక్షణం వుంది. విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని ప్రబోధించిన సనాతన ధర్మ స్ఫూర్తిని విస్మరించి, మతం పేరుతో మనుషులను విడదీసే అనాగరిక సిద్ధాంతాలు పాటిస్తారు. మానవ నాగరికత పరిపరి విధాలా వికాసం చెందుతున్నప్పటికీ, ఆటవిక ఆలోచనలలో మ్రగ్గిపోవడం వారి జాడ్యం. ప్రపంచంలోనే అతి పెద్ద స్వచ్ఛ సేవా సంస్థగా గుర్తింపు పొందిన వారిమీద ఇటువంటి కటువైన వ్యాఖ్యలు చేయడం సమంజసమా అన్న భావన కలగవచ్చు. కానీ ఆ కాఠిన్యం వారి పట్ల సహేతుకమని నిస్సందేహంగా చెప్పవచ్చు.
తమను తాము దేశభక్తులుగా అభివర్ణించుకోవడం ఆర్.ఎస్.ఎస్ కు అలవాటు. కానీ వారు దేశ భక్తులు ( పేట్రియాట్ ) కారు; జాతీయవాదులు ( నేషనలిస్ట్ ) మాత్రమే. దేశభక్తి అంటే ప్రేమతో, ఆరాధనతో దేశం పట్ల సద్భావనలు కలిగి వుండడం; జాతీయవాదం అంటే ఇతరుల కంటే తమది ఆధిపత్య జాతి అనే భావనతో; రాజకీయ, సాంస్కృతిక, ప్రాదేశిక అంశాలలో తమ ఆధిపత్యం చాటుకోవాలనే ప్రయత్నం చేసే వారని అర్ధం. జాతీయవాదులకు ఇతర వర్గాల మీద తీవ్ర అసహనం వుంటుంది. ఆర్.ఎస్.ఎస్ లో ఆ లక్షణాలన్నీ మూర్తీభవించి వున్నాయి.
సైన్యంతో సమానంగా ఆర్.ఎస్.ఎస్ కూడా దేశ రక్షణ బాధ్యత చూడగలదని ఇటీవల ఒక ప్రకటన చేశాడు మోహన్ భగవత్. అంటే, అవసరమైతే తమ సంఘ్ సభ్యులు ఆయుధాలు చేత పట్టుకోవడానికి సిద్ధంగా వున్నారని అర్ధం. పర మతాల పట్ల అసహనం, కేవలం హిందువులతో మాత్రమే రాజ్యం ఏర్పరచాలన్న లక్ష్యం. ఇజ్రాయిల్ తో పోలిక వంటివి ఆర్.ఎస్.ఎస్ నిజ స్వరూపాన్ని చెప్పకనే చెప్తున్నాయి. ఆ సంస్థకు వేల కోట్ల రూపాయల నిధుల లభ్యత వుంది. ఢిల్లీలో వాళ్ళు కట్టుకున్న ఆఫీస్ భవంతి కోసం ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. తాము కేవలం గురుదక్షిణ రూపంలో విరాళాలు స్వీకరిస్తామన్నది వారి వాదన. మన దేశంలో ఎవరు స్వచ్ఛంద సంస్థ నడపాలన్నా ప్రభుత్వ చట్టాల ప్రకారం రిజిస్టర్ చేయించుకోవాలి. నిధుల లెక్కలు ఇన్ కమ్ టాక్స్ విభాగానికి తెలపాలి. ఆడిట్ చేయించాలి. ఆర్.ఎస్.ఎస్ లో ఇవేవీ వుండవు. భారతదేశ చట్టాలు, నిబంధనలు తమకు వర్తించవన్న దురహంకారంతో తమ నిధులకు ఎవరికీ లెక్క చెప్పరు. దీన్ని గమనించిన కర్ణాటక హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే, మీ సంస్థ వివరాలు సమర్పించమని తాఖీదు పంపాడు. అయితే తామెవరికీ సమాధానం చెప్పనవసరం లేదని మోహన్ భగవత్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. ఆయన ధీమా, తమ బిజెపి ప్రభుత్వం ఢిల్లీలో వుంది. కాబట్టి, దాని స్వారస్యపు తాడు తమ చేతిలో వుంది కాబట్టి, ఎవరిని చూసి భయపడనవసరం లేదన్నది.
నీతులు బోధించే ఆర్.ఎస్.ఎస్ వంటి సంస్థలు చట్టాలకు అతీతంగా వ్యవహ రించడం సమంజసమా? ప్రభుత్వానికి, ప్రజలకు జవాబు దారీగా వుండవలసిన అవసరం వారికి లేదా? ఆర్.ఎస్.ఎస్ అంటే, సర్వసత్తాక సమాంతర ప్రభుత్వమని భావించాలా? ఏమిటి ఈ ధిక్కార ధోరణి? వారెంత నిజాయితీగా సంస్థను నడుపుతున్నామని చెప్తున్నప్పటికి, ఇటీవల కాలంలో ఆర్.ఎస్.ఎస్ ప్రముఖులు చాలామంది చవకబారు పైరవీకారులుగా వ్యవహరిస్తున్నారన్న నిజం అంగీకరించి తీరాలి. అంటే, స్వార్థం అనే దుర్లక్షణం ఆ సంస్థ మూలాలను ఆశించిందని అర్థం. పైరవీలతో పొందే పదవులు, వేల కోట్ల వ్యక్తిగత రాబడులకు సమాధానం చెప్పని వారు, తమను తాము సచ్ఛీలురమని వర్ణించుకుంటే సరిపోతుందా? యావత్ హిందూ సమాజానికి తాము రక్షకులమని, అందుకోసమే తమ శాఖలలో యుద్ధ విద్యలు నేర్పిస్తామని చెప్పుకునే ఆర్.ఎస్.ఎస్ ప్రముఖులు జడ్ ప్లస్ రక్షణలో తిరుగుతున్నారు. తమను తాము రక్షించుకోలేనివారు, సమాజాన్ని రక్షించేది ఏమిటి?
ఏది ఏమైనా, మతపరమైన విషపూరిత భావాలు కలిగిన ఆర్.ఎస్.ఎస్ వంటి సంస్థలను చట్ట పరిధిలోకి తెచ్చి, జవాబుదారీతనం ఏర్పరచకుంటే ఏ రోజైనా దేశానికి ప్రమాదకరంగా మారే అవకాశం వుంది. కర్ణాటక హోం మంత్రి లేవనెత్తిన ఈ కీలక ప్రశ్నకు తార్కిక సమాధానం వస్తుందని ఆశిద్దాం.
‘జమీన్ రైతు’ సౌజన్యంతో








కామెంట్‌లు (0)