mh ad
శుక్రవారం, 26 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తెలివైన మిల్కీ

1 గంట క్రితం

telivaina milky
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 26, 2026, 04:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

అనగనగా ఒక పచ్చని కొండపై 'మిల్కీ' అనే ఒక తెల్లటి బుజ్జి మేకపిల్ల ఉంది. అది చాలా తెలివైనది, చురుకైనది కూడా! దానికి ఆటలన్నా, పొడుపుకథలన్నా చాలా ఇష్టం. ఒకరోజు మిల్కీ అడవిలో షికారు చేస్తుండగా దారిలో ఒక పెద్ద తోడేలు ఎదురైంది. దాన్ని చూడగానే మిల్కీకి పై ప్రాణాలు పైనే పోయాయి. అయినా లేని ధైర్యాన్ని తెచ్చుకుంది. మిల్కీని చూడగానే తోడేలుకు నోట్లో నీరూరింది. ‘ఆహా! ఈరోజు నాకు మంచి విందు దొరికింది. నిన్ను ఇప్పుడే తినేస్తా!’ అంది తోడేలు క్రూరంగా నవ్వుతూ. మిల్కీ భయపడకుండా అక్కడే నిలబడింది. ‘తోడేలు మామా! నన్ను తిను. కానీ, నాదొక చిన్న కోరిక. నువ్వు చాలా తెలివైన దానివని విన్నాను. నేను ఒక పొడుపు కథ అడుగుతాను. నువ్వు దానికి సమాధానం చెబితే నేనే నీ నోట్లోకి వస్తాను. చెప్పలేకపోతే నన్ను వదిలేయాలి’ అంది. తోడేలు ఆ మాటలకు ఆలోచనలో పడింది. జవాబు చెప్పకపోతే తను తెలివి తక్కువ అని ఒప్పుకున్నట్లవుతుంది. అందుకే, ‘సరే, ఏంటో అడుగు!’ అంది.

‘మామా! నా వెనుక నా నీడ ఉంది కదా. నేను నడిస్తే అది నడుస్తుంది. నేను ఆగితే అది ఆగుతుంది. కానీ, నేను ఎంత గట్టిగా పరిగెత్తినా... నా నీడ నన్ను ఎప్పటికీ దాటలేదు! కానీ, నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా నా నీడ నా కంటే ముందుకు వెళ్లేలా చేయగలను! అది ఎలాగో చెప్పు?’ అంది మిల్కీ. తోడేలు బుర్ర గోక్కుంది. ‘నువ్వు కదలకుండా నీ నీడ ముందుకు ఎలా వెళ్తుంది? నువ్వు ఎగిరినా నీడ కిందే ఉంటుంది కదా!’ అంటూ చాలాసేపు ఆలోచించింది. ఎంతసేపటికీ దానికి సమాధానం దొరకలేదు.

‘నాకు తెలియడం లేదు. నువ్వే చెప్పు’ అంది తోడేలు ఓటమిని ఒప్పుకుంటూ. మిల్కీ నవ్వి, ‘చాలా సులువు మామా! నేను ఉన్నచోటే వెనక్కి తిరిగితే చాలు... నా వెనుక ఉన్న నీడ నా ముందుకు వచ్చేస్తుంది!’ అంది. తోడేలు ఆ జవాబు విని ఆశ్చర్యపోయింది. ఇచ్చిన మాట ప్రకారం మిల్కీని ఏమీ చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. మిల్కీ తన ఉపాయంతో ప్రాణాలు కాపాడుకుని సంతోషంగా ఇంటికి చేరుకుంది.


- కె.వి. సుమలత

94926 56255

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్